Tuesday 19 June 2012

కనుమరుగవుతున్న నకాషీల నగిషీలు!


June 14, 2012
nagashi0 
భారతీయ హస్తకళా సంస్కృతికి మకుటాయమానం నిర్మల్‌ బొమ్మలు, పెయింటింగ్స్‌. ఇవి తెలుగువారి హస్తకళా కౌశలాన్ని ప్రపంచానికి చాటిచెపుతున్నాయి. అయితే ఈ ఘనత ఎంతోకాలం నిలిచేపరిస్థితులు కనిపించట్లేదు. బొమ్మల తయారీకి కావలసిన చెక్క అందుబాటులో లేకపోవడంతో ఈ కళాకారులు అడ్డాల దగ్గర కూలీలుగా మారుతున్నారు. దొరికిన పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నకాషీ... పేరు చెపితే ఈ కులస్తులు మన రాష్ర్టంలో ఎక్కడున్నారనే ప్రశ్న రాకమానదు. అదే నిర్మల్‌ పేరు చెపితే మాత్రం, వెంటనే ఆదిలాబాద్‌ జిల్లా గుర్తొస్తుంది.

నిర్మల్‌ పెయింటింగ్స్‌, నిర్మల్‌ బొమ్మల రూపశిల్పులు వీరే! వీరిని చిత్తారి, చిత్రకార్‌ అని కూడా పిలుస్తారు. కొండపల్లి బొమ్మలు కూడా వీరే తయారు చేస్తారు. వీరు ఎక్కడ ఉన్నా ఈ కళ తమకే పరిమితం కావాలని భావించేవారు కాదు. శిక్షణ కేంద్రాలు పెట్టి ఇతరులకు కూడా ఈ కళను నేర్పించే ప్రయత్నం చేశారు. విడివిడిగా ఉంటే బడా వ్యాపారుల పోటీకి తట్టుకోలేరనే భావనతో ఐక్యంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే సొసైటీ ప్రారంభించి దాని ద్వారా తయారుచేసిన బొమ్మలు మార్కెట్‌ చేస్తున్నారు. ఇక గణేష్‌ ఉత్సవాలు వచ్చాయంటే మట్టి బొమ్మలు తయారుచేసి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతున్నారు.

వీరి పూర్వీకులు మహారాష్ర్టకు చెందివారు. 17వ శతాబ్దాంలో నిమ్మల (ప్రస్తుత నిర్మల్‌)ను పాలించిన పద్మనాయక్‌ వంశానికి చెందిన నిమ్మనాయుడు కళారాధకుడు. మహారాష్ర్ట నుంచి నకాషీ కళాకారులను రప్పించి కొయ్యబొమ్మల తయారీని ప్రోత్సహించారు. అప్పటి నుంచి కొయ్యబొమ్మలకు నిర్మల్‌ పేరుగాంచింది. అయితే నిర్మల్‌ ప్రాంతాన్నే కేంద్రంగా చేసుకుని వీరు బొమ్మలు తయారుచేయటానికి ఒక కారణం ఉంది. ఈ ప్రాంతంలోని అడవులలో పెరిగిన ‘పొనికి’ అనే చెట్టు బొమ్మల తయారీకి ఉపయోగపడుతోంది. ఎండిన పొనికి చెక్కకు నగిషీలు చెక్కి నకాషీలు కొయ్య బొమ్మలను తయారుచేస్తారు. అయితే ఈ చెట్లు అంతరించిపోయే దశకు చేరుకోవటంతో కర్ర దొరకటం గగనమైంది.

nagashiఅడవిలోని ఈ పొనికి చెట్లను నరికితే అటవీ శాఖ అధికారులు కేసులు పెడతారు. కనుక వీరు అడవిలో తిరిగి ఎక్కడన్నా ఎండిన పొనిక మోడు కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు చూపిస్తారు. వారి అనుమతితో సొసైటీ ద్వారా వీరు ఆ మోడును నరికించుకుని తెచ్చుకుంటారు. దీనికి కూడా వీరు పన్ను చెల్లించాలి. జన్నారం, ఉట్నూరు ప్రాంతాలేకాదు... బెల్లంపల్లి, నెన్నెల, భీమారం, రాయదరి, తదితరప్రాంతాల నుంచి ఈ కర్ర తెప్పించుకునే వారు. నిర్మల్‌కు ఆయా ప్రాంతాలు దూరం కావటంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాలలో కూడా ఈ పొనికి చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ చెట్లను పెంచే ప్రయ త్నాలు ప్రభుత్వం చేపట్టి నప్పటికీ సఫలం కాలేదు. ఇదిలా ఉంటే... ఉన్న చెట్లను మత్యకారులు నరికి తెప్పలు తయారు చేస్తున్నారు.

ఈ కలప బరువుతక్కుగా ఉండటం, చీడపీడలకు గురికాకుండా ఎక్కువ కాలం మన్నుతుంది కనుక దీనిపై వారు కన్ను వేశారు. ఈ విధంగా ఎన్నో కష్టా లను ఎదుర్కొంటెతప్ప పొనికి చెక్క ఇంటికి చేరదు. మహిళలు చిన్న చిన్న బొమ్మలను తయారుచేస్తే, పురుషులు పెద్దవి, కళాత్మక విలువలున్నవి తయారుచేస్తారు. చిన్న పిల్లలు సైతం బొమ్మల తయారీకి సహకరిస్తారు. తయారైన విడిభాగాలను అతికించడానికి చింతపిక్కల అంబలిని ఉపయోగిస్తారు. సకాలంలో చెక్క దొరకని పక్షంలో పస్తులే. సకాలంలో చెక్క చేతికి అందితే మాత్రం నెలలో 50 బొమ్మలు తయారుచేస్తారు.

001వీటికి అన్ని రంగులూ అద్ది మార్కెట్‌ చేస్తే మూడు వేల రూపాయలు వస్తాయి. అంటే ఇంటిల్లపాదీ కష్టపడి సహకార సంఘ ద్వారా అమ్మితే చేతికందేది మూడు వేల రూపాయలు మాత్రమే. వీటిని అమ్ముకోవటానికి నేటికీ వీరు ఊళ్లుపట్టి తిరుగుతున్నవారూ ఉన్నారు. ఎక్కడ ఎగ్జిబిషన్లు జరిగితే అక్కడకు వెళ్ళి తాము తయారుచేసిన వస్తువులను మార్కెట్‌ చేస్తున్నారు. కొండపల్లి బొమ్మలు కూడా వీరే తయారుచేస్తారు. అయినప్పటికీ కళాకారులుగా వీరికి ఎటువంటి గుర్తింపులేదు.

నిర్మల్‌ పెయింటింగ్స్‌కు దేశ విదేశాలలో తమ విశిష్టతను చాటుతున్నాయి. భారతీయ సంస్కృతిని ఇవి చాటుతున్నాయి. ఈ పెయింటింగ్‌ పై నీళ్లు పడినా పాడైపోదు. దాదాపు వందేళ్ల వరకు చెక్కుచెదరదు. కనుకనే ఈ పెయింటింగ్స్‌ను ఎక్కువమంది తమ ఇళ్లలో అలంకరించుకునేందుకు మక్కువ చూపుతున్నారు. షో రూమ్‌ల ద్వారా వీటికి మార్కెట్‌ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది. శిక్షణా కేంద్రాల ద్వారా వీరు ఇతరులకు ఈ విద్యను నేర్పిస్తున్నారు. అయితే ఈ కళాఖండాలు ఎగువ మధ్యతరగతి, ఉన్నత స్థాయి వారే కొనుగోలు చేసే అవకాశం ఉన్న కారణంగా వీటిపై పెద్దఎత్తున మార్కెట్‌ జరుగట్లేదు. కనుక ఈ వృత్తిని ఎంచు కున్న వారు ఇతర వృత్తులపై కూడా ఆధారపడాల్సి వస్తోంది.

బొమ్మల తయారీ, పెయిం టింగ్స్‌లో నిష్ణాతులైన వీరికి రోజు గడవటం కష్టం కావటం తో ఇతర మార్గాలను ఎంచు కున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఖమ్మం జిల్లాలో కార్పెంటర్లుగా జీవనం సాగించారు. విదేశీ ఫర్నీచర్‌ మన దేశానికి దిగుమతి కావటం, రెడీమేడ్‌ ఫర్నీచర్‌ షాపుల సంఖ్య పెరగటంతో వీరి వృత్తి దెబ్బతింది. దీంతో వీరి జీవనం దుర్లభమైంది. ఇదిలా ఉంటే కొందరు హైదరాబాద్‌లో కార్లకు పెయింట్లు వేసే వృత్తిని ఎంచుకున్నారు. గతంలో చేతినిండా పని ఉండేది. ఆధునిక కార్లు రోడ్లమీదికి రావటం, అత్యాధునిక పెయింటింగ్‌ పరికరాలు రంగప్రవేశంతో వీరికి పనుల తగ్గాయి. ఇంకొందరు నెల్లూరుజిల్లాలో టైలర్లుగా స్థిరపడగా రెడీమేడ్‌ షాపులు రాకతో వీరికీ పనులు కరువయ్యాయి.

ఈ విధంగా ఎంచుకున్న ఇతర వృత్తులు కూడా దెబ్బతినడంతో వీని మనగడ అగమ్యగోచరంగా మారింది. దశాబ్దాలుగా వృత్తినే నమ్ముకున్న కారణంగా విద్యపై దృష్టి సారించకపోవటంతో నకాషీలు అన్నింటా వెనుకబడ్డారు. చివరకు మట్టి, రంపపు పొట్టు కలిపి చిన్న చిన్న బొమ్మలు తయారుచేసి రోజులు గడుపుకొస్తున్నారు. అరటి, సీతాఫలం, ఆపిల్‌ వంటి బొమ్మలను తయారుచేసి తోపుడు బండ్లపై అమ్ముటానికి సైతం సిద్దపడినా ప్రయోజనం కనిపించలేదు. ఇటువంటి దుర్బర పరిస్థితిలో జీవనం గడుపుతున్న నకాషీలకు ప్రభుత్వపరంగా సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రభుత్వం ఆదుకోవాలి
దేశ విదేశాలలో భారతీయ సంసృ్కతిని చాటుతున్న నకాషీ సామాజిక వర్గం దయనీయ స్థితికి చేరకుంటోది కనుక ప్రభుత్వం సహాయం అందించాలని శ్రీ శోమ క్షత్రియ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కేశవరావు కోరుతున్నారు. నకాషీ కులస్తులు తయారుచేసిన బొమ్మలను నేటికీ సంచారంచేసి అమ్ముకుని జీవిస్తుంటారు. కనుక సంచార, పాక్షిక సంచార జాతులను ఏ విధంగా బీసీ- ఏ గ్రూప్‌లో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారో అదే విధంగా తమ కులాన్నీ బిసి-బి నుండి మార్చాలంటారు.

తమ సామాజికవర్గం కులవృత్తి చేసుకుందామంటే పొనికి చెక్క దొరకకపోవడంతో ఉపాథి కరువై ఇతర వృత్తులు చేసుకుని రోజులు గడుపుతున్నారని తెలిపారు. కళాకారులకు అందించే పెన్షన్‌ సౌకర్యం తమవారికి కూడా కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65ఏళ్లు అవుతున్నా తమ సామాజిక వర్గానికి చెందినవారు ఒక్కరు కూడా చట్టసభలలో ప్రవేశించలేదని తెలిపారు. కనీసం ఎమ్మెల్సీ వంటి నామినేటెడ్‌ పోస్టులను నకాషీ కులస్తులకు కూడా కేటాయించాలని కోరారు.

table

No comments:

Post a Comment