Friday 13 July 2012

FAKE ENCOUNTERS OF SITARAMANJANEYULU

ఎన్‌కౌంటర్లు కావు.. ఖాకీ వేట
ఎస్పీగా సీతారామాంజనేయులు సంహారకాండ
నప్పుబట్టిన జాతీయ హక్కుల కమిషన్
16 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం

గుంటూరు, కర్నూలు ఎస్పీగా చెలరేగిన పీఎస్ఆర్
రెండేళ్లలో 19 మంది కాల్చివేత
నక్సల్స్, ఫ్యాక్షనిస్టులంటూ హత్యలకు 'చట్టబద్ధత'
కోర్టుకు వెళ్లకముందే 'ఖాకీ తీర్పు'.. మరణ శిక్ష
నరమేధంపై నిలదీసిన మానవ హక్కుల వేదిక
జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
కమిషన్‌ను కదిలించిన న్యాయవాది చంద్రశేఖర్
రామాంజనేయులుపై కేసు పెట్టాలి: చంద్రశేఖర్
కాలేజీకి పోయిన కుర్రాళ్లు శవాలై ఇంటికి వస్తారు. పొద్దున్నే పొలానికి పోయిన రైతు మళ్లీ ఆ ఊళ్లో ఎవరికీ కనిపించడు. అప్పటిదాకా టీ కొట్టు దగ్గర బాతాఖానీ కొట్టిన చోటామోటా నేత కాస్తా ఆలివ్‌గ్రీన్ దుస్తుల్లోకి మారిపోయి గుర్తుతెలియని మృతదేహంగా మారతాడు. ఏదో పని మీద బయట ఊరికి బయలుదేరిన భర్త, తీవ్రవాది ముద్రతో తెల్లారిపోతాడు. సినిమాకు స్నేహితులతో బయలుదేరిన కొడుకు, వారందరితో పాటు రహస్య సమావేశంలో ప్రత్యక్షమై, భీకర ఎదురు కాల్పుల్లో మరణిస్తాడు.. నియంతల ఏలుబడిలోని లాటిన్ అమెరికా దేశాల్లోనో, ప్రైవేట్ సాయుధ సైన్యాల కనుసన్నల్లోని బీహార్, ఉత్తరప్రదేశ్‌లలోనో జరిగిన ఘటనలు కావివి. ద గ్రేట్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు పి. సీతారామాంజనేయులు జరిపించిన నరమేధంలోని కొన్ని నెత్తుటి పుటలివి. 2000 ప్రాంతంలో ఆయన కర్నూలు, గుంటూరు ఎస్పీగా ఉండగా.. వివిధ కేసుల్లోని నిందితులను.. 'ఆత్మరక్షణ' పేరిట, నక్సలైట్ల సాకుతో చంపించిన తీరిది. కోర్టులు, చట్టాలు, సర్వీస్ నిబంధనలన్నింటినీ తోసిరాజని.. తుపాకీ చేతపట్టి సాగించిన వేట తీరిది. ఈ కిరాతకానికి ఎన్‌కౌంటర్ అని పేరు..ఖాకీ ముఖానికి గల హింస పార్శ్వానికి పరాకాష్ఠలా సాగిన ఈ బూటకపు ఎన్‌కౌంటర్ల తీరుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం నివ్వెరపోయింది. మానవ హక్కుల వేదిక నేత, న్యాయవాది బి. చంద్రశేఖర్ రెండు దశాబ్దాల పోరుకు స్పందించింది. "ఇంత దారుణంగా చంపిపడేసి.. ఎన్‌కౌంటర్ అంటారా?'' అని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు డిపార్టుమెంట్‌పై ఫైర్ అయింది. మొత్తం 19 కేసుల్లో 16 కేసులను 'బూటకం'గా తేల్చి బాధితులకు రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్‌కౌంటర్ కేసుల్లో ఈస్థాయిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
పి.సీతారామాంజనేయులు..వివాదాస్పద పోలీస్ అధికారి. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులపై రౌడీయిజం చే యడం మొదలు, విజయవాడ కమిషనర్‌గా.. నగర శాంతి భద్రతలను పక్కనబెట్టి, ఈవ్‌టీజర్ అవతారం ఎత్తడం దాకా ఎన్నో వివాదాల్లో చిక్కుకొని 'వేటు'కు గురైన ఖాకీ బాస్. కానీ, ఆయన సర్వీస్‌లోని మరో చీకటి కోణం ఇప్పుడు వెలుగు చూసింది. 2000 నుంచి 2002 మధ్య కాలంలో గుంటూరు, కర్నూలు ఎస్పీగా ఉండగా ఎడాపెడా చేయించిన 'ఎన్‌కౌంటర్లు' ఆయన మెడకు చుట్టుకున్నాయి. చేసిన పాపం చేతులు కడుక్కుంటే పోదు అన్నట్టు..ఆయా ఎన్‌కౌంటర్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టి సారించింది. వాటన్నింటిని దాదాపు బూటకం గా తేల్చి మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున పరిహా రం అందజేయాలని ప్రభుత్వానికి సూచించిం ది. దీంతో..బాధితులను గుర్తించి పరిహారం పంపిణీ చేసే పని ఇప్పటికే మొదలైంది. పలు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన కాలంలో సీతారామాంజనేయులు బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడినట్టు గుంటూరుకు చెందిన మానవ హక్కుల వేదిక నేత, న్యాయవాది బి చంద్రశేఖర్ 2002 జూలై 11న ఎన్‌హెచ్ ఆర్‌సీకి ఫిర్యాదు చేయడంతో తీగ కదిలింది. అప్పట్లో జరిగిన మొత్తం 19 ఎన్‌కౌంటర్ కేసుల వివరాలను కమిషన్‌కు ఆయన ససాక్ష్యంగా సమర్పించా రు. దీనిపై గత ఏడాది నవంబర్‌లో కమిషన్ విచారణ పూర్తి చేసింది. 16 కేసుల్లో ఎన్‌కౌంటర్ బూటకమని తేల్చి ంది. అందులో 10 కేసులు కర్నూలు, ఆరు గుంటూరులో నమోదయ్యాయి. వీటిలో ఒక్కటిమాత్రమే నక్స ల్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసు. కాగా, బా ధితులకు పాక్షిక న్యాయం మాత్రమే అం దినట్టు చంద్రశేఖర్ అభిప్రా యపడ్డారు. బాధ్యులకు శిక్ష పడేదాకా పోరు ఆగదని, అవ సరమైతే సుప్రీంకోర్టుకు వెళతా మన్నారు. మరోవైపు, సీతారామాంజ నేయులను శిక్షించాలంటూ బాధితులు హైకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు.

కర్నూలులో నెత్తురు పారిందిలా..

2000 మే 16: డోన్‌లో టీడీపీ సానుభూతిపరుడు ఏరుకుల శ్రీను (30) కాల్చివేత.

జూన్ 12: మామిడాలపాడు వద్ద టీడీపీ సానుభూతిపరులు పిక్కిలి బాబు (30), బోయ వెంకట రాముడు(35), వెంకటేశ్వర్లు (32) కాల్చివేత. వీరందరినీ ఓ కేసులో కర్నూలు జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకు వెళ్లే క్రమంలో చంపేశారు.

జూలై 14: కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకి రామలింగ ప్రసాద్ (28)ను హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అదుపులోకి తీసుకొని బనగానపల్లి వద్ద కాల్చివేశారు.

జూలై 22: మహానంది మండలం గాజుపల్లి వద్ద నల్లబోతుల సుంకన్న కాల్చివేత. నిజానికి, అంతకు వారం క్రితం సోదరి ఇంటి నుంచి పోలీసులు సుంకన్నను మాయం చేశారు. నకిలీ నక్సలైట్ అనేది పోలీసుల అభియోగం.

సెప్టెంబర్ 23: కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, హత్య, పలు చోరీ కేసుల్లో నిందితుడు బసివిరెడ్డి అశ్వద్ధ్దరెడ్డి (35)ని ప్రకాశం జిల్లా కనిగిరిలో అదుపులోకి తీసుకొని కర్నూలు జిల్లా బేతంచర్ల వద్ద కాల్చేశారు.

అక్టోబర్ 22: హత్యాయత్నం కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన కల్లూరి వెంకటేశ్వర్లు (35)ను ఇంటి నుంచి తీసుకెళ్లి చంపేశారు.

డిసెంబర్ 4: మాజీ సీఎం కోట్ల విజయ భాస్కరరెడ్డి తనయుడు సూర్య ప్రకాష్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వస్తున్న కాంగ్రెస్‌కు చెందిన కిష్టన్న (45) రాముడు అలియాస్ రసూల్ (42)ను తీసుకెళ్లి కాల్చివేత. వారిద్దరిపై ఫ్యాక్షనిస్టు ముద్ర ఉంది.

2001 ఏప్రిల్ 2: తల్లితో పాటు హోటల్‌లో ఉన్న టీడీపీ కార్యకర్త కొమరవోలు రమేష్‌ను పట్టుకొని చెన్నమొహట్టిపల్లి వద్ద కాల్చేశారు.

ఆగస్టు 2: సిపిఐ నేత, పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడు గుండ్లకొండ శ్రీనివాసులుని (35) గ్రామంలో పట్టుకొని దేవరకొండ వద్ద కాల్చేశారు.

నవంబర్ 11: రాజబాబు అలియాస్ రాజు (35)ను పిన్నాపురం వద్ద చంపేశారు.

గుంటూరు గుండెల్లో తూటా..

2002 మే 4: పలు దోపిడీ కేసుల్లో నిందితుడు మేడా వెంకటేశ్వర్లు (40)ను మణికొండలోని ఇంటి వద్ద నుంచి మే 1న తీసుకెళ్లి నాలుగు రోజుల తరువాత సీతానగరం వద్ద కాల్చేశారు.

జూన్ 4: దోపిడీ కేసుల్లో రిమాండ్ ఖైదీలు కోదాటి శ్రీను (36), కంపా శ్రీను (30) తాడిగిరి సురేష్ (35), మేచర్ల లక్ష్మణరావు (40)లను సత్తెనపల్లి సబ్ జైల్ నుంచి గుంటూరు కోర్టుకు తీసుకువస్తూ పేరేచర్ల వద్ద కాల్చేశారు.

జూలై 7: పీపుల్స్‌వార్ పార్టీ కార్యకర్త దున్నా సుధాకర్ (24)ను నాగార్జున సాగర్ వద్ద అదుపులోకి తీసుకొని రెండు రోజుల తరువాత పల్నాడులోని పసర్లపాయి తండా వద్ద కాల్చేశారు.

ఇదేం ఎన్‌కౌంటర్..?

పేరు మేడా వెంకటేశ్వర్లు. విజయవాడ-వెంకటపాలెం రోడ్డుపై 2002 మే 4న తెల్లవారు జామున 3 గంటలకు తారసపడ్డాడు. ఆరా తీసేందుకు సబ్-ఇన్‌స్పెక్టర్ కె సుధాకర్ ఆగమన్నాడు. కానీ వెంకటేశ్వర్లు ఆగకపోగా కాల్పులు జరపడంతో ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. రివాల్వర్‌లో బుల్లెట్లు అయిపోయేంతవరకూ కాల్పులు జరిపి తర్వాత మళ్లీ లోడ్ చేసుకుని కాల్పులు కొనసాగించాడు. కాల్పులు ఆగిపోయాక వెళ్లి చూస్తే వెంకటేశ్వర్లు చనిపోయి ఉన్నాడు''.. ఇదీ ఎస్ఐ 'ఆత్మరక్షణ' కథనం. కానీ, ఈ కథనాన్ని కమిషన్ తోసిపుచ్చింది. " వెంకటేశ్వర్లు శరీరంపై ఉన్న గాయాలను బట్టి చూస్తే మీ కథనం నమ్మశక్యంగా లేదు.

ఛాతీకి గురిపెట్టి నాలుగు సార్లు కాల్పులు జరిపినట్లు పోస్టుమార్టం రిపోర్టు చెబుతోంది. నాలుగూ ఛాతీకే ఎలా తగిలాయి? నిస్సహాయుడై ఉన్నప్పుడు ఎస్ఐ వరుసగా కాల్పులు జరిపి ఉంటాడు. ఇది మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే'' అని తేల్చి చెప్పింది. అంతేకాదు.. సదరు ఎన్‌కౌంటర్లపై పదే పదే నోటీసులు పంపినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. కాగా, ఈ ఉదం తం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని రాష్ట్ర పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

బలయింది బడుగులే..

మొత్తం 19 మందిలో ఇద్దరు తప్ప అందరూ బడుగులే. వారిలో 9 మంది ఎరుకలు కాగా, ఐదుగురు బోయలు. ముగ్గురు దళితులు. వీరిలో కొందరు నేరస్తులూ ఉండొచ్చు. తీవ్ర నేరాభియోగాలు నమోదై ఉండవచ్చు. కానీ, ఈ కారణంగా పిట్టల్లా కాల్చి చంపే హక్కు పోలీసులకు లేదనేది హక్కుల నేతల వాదన. కానీ, తాను పనిచేసిన ప్రతి జిల్లాలోనూ సీతారామాంజనేయులు..మనుషులను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించారనేది కమిషన్ ఆదేశాలతో తేలిపోతోంది.
- ఆన్‌లైన్, న్యూఢిల్లీ, హైదరాబాద్, గుంటూరు, కర్నూలు

HOUSE OF SKULLS




పుర్రెల గృహం

స్ట్రేంజ్



ఆస్ట్రియాలోని ‘బోన్ హౌజ్’లో వందలసంఖ్యలో పుర్రెలు భద్రపరచబడి ఉన్నాయి. పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ బోన్ హౌజ్‌ను నిర్మించడానికి ఒక కారణం ఉంది. సరస్సు పక్కనే ఒక శ్మశానం ఉండేది. చుట్టు పక్కల ప్రాంతాల మృతులను పూడ్చిపెట్టడానికి ఆ శ్మశాన స్థలం సరిపోయేది కాదు. దీంతో బోన్ హౌజ్ నిర్మించారు.

మృతశరీరాలను శ్మశానంలో పాతి పెట్టిన పది, పదిహేను సంవత్సరాల తరువాత వాటి పుర్రెలను ఈ బోన్ హౌజ్‌లో పెడతారు. షెల్ఫ్‌లలో పుస్తకాలను భద్రపరిచినట్లు ఈ పుర్రెలను భద్రపరిచి, అందంగా అలంకరించి వాటి మీద పేర్లు రాస్తారు. కొవ్వొత్తులు వెలిగిస్తారు!

BAN ON LOVE IN A UP VILLAGE








ప్రేమ వివాహాలపై నిషేధం



7/14/2012 12:03:00 AM

- మహిళల షాపింగ్ కుదరదు
- యూపీ గ్రామంలో తాలిబన్ తరహా నిషేధాజ్ఞలు

బాఘ్‌పట్: ఉత్తరప్రదేశ్‌లో తాలిబన్ల తరహా సంస్కృతి బుసలుకొట్టింది. ఓవైపు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే ఉత్తరప్రదేశ్ బాఘ్‌పట్ జిల్లాలోని అసారా గ్రామంలో ఉన్న ఖాప్ పంచాయతీ మాత్రం అతివల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా... వారి స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా అర్థంలేని ఆంక్షలు విధించింది. ప్రేమ పెళ్లిళ్లను నిషేధించడంతోపాటు 40 ఏళ్లలోపు మహిళలు షాపింగ్‌కు వెళ్లరాదని, ఇళ్ల బయట సెల్‌ఫోన్లు వాడరాదని హుకుం జారీ చేసింది. అలాగే బయటకు వెళ్లేటప్పుడు మహిళలంతా తప్పనిసరిగా తలను వస్త్రంతో కప్పుకోవాలని ఆదేశించింది. బుధవారంనాటి సమావేశంలో ఖాప్ పంచాయతీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తమ ఆదేశాలు ధిక్కరించి ఎవరైనా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే గ్రామం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఈ విషయంపై ప్రశ్నించేందుకు మోకిమ్, ముజాహిద్ అనే ఇద్దరు పంచాయతీ సభ్యులను పోలీసులు గురువారం పిలిపించారు. అయితే, వారిని విడి చిపెట్టాలంటూ అల్లరిమూక ఆందోళనకు దిగింది. అక్కడ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు వెళ్లిన ఇద్దరు పోలీసులపై కూడా అల్లరిమూక దాడి చేసింది. వారి ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టింది.


దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతల విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ బి.పి.సింగ్ లక్నోలో తెలిపారు. ఇంత దుమారం చెలరేగినా యూపీ మంత్రి మొహమ్మద్ ఆజంఖాన్ మాత్రం ఖాప్ పంచాయతీ ఆదేశాలనే వెనకేసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చని... దాన్ని ఎలా అడ్డుకుంటామని విలేకరులకు ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ఇలాంటి ఆదేశాలను బలవంతంగా లేదా చట్టవ్యతిరేకంగా అమలు చేయాలనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.


యూపీ సర్కారు చర్యలు తీసుకోవాలి: చిదంబరం

అసారా గ్రామ ఖాప్ పంచాయతీ ఆంక్షలను కేంద్ర హోంమంత్రి చిదంబరం తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చట్టవ్యతిరేక ఆదేశాలను అమలు చేయాలనుకునే వారిపై యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు చిదంబరం శుక్రవారం చండీగఢ్‌లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సమాజంలో ఇటువంటి వాటికి చోటు లేదన్నారు. ఈ ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ చీఫ్ మమతా శర్మ విచారం వ్యక్తం చేశారు. ఖాప్ పంచాయతీలకు రాజ్యాంగాధికారాలేవీ ఉండవన్నారు. ఆధునిక యుగంలో ఇటువంటి ఆదేశాలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు, ఈ విషయమై తక్షణమే నివేదిక సమర్పించవలసిందిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ బాఘ్‌పట్ జిల్లా అధికారులను ఆదేశించింది.

DRUGS LOW QUALITY

ఇదేమి మాత్ర.. వైకుంఠ యాత్ర

మందుల మాయా బజార్

7/14/2012 1:05:00 AM

2011 ఏప్రిల్ సంగతి. కాకినాడలో రేబిస్ సోకి 10 మంది మరణించారు. వారందరికీ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్‌వీ) వేసినా ఫలితం లేకపోయింది. ఆ వ్యాక్సిన్ పని చేయకపోవడమే మరణానికి కారణమని అధికారులు కూడా ధ్రువీకరించారు. అయినా సరే, అదే నాసిరకపు మందు ఇప్పటికీ యథావిధిగా సరఫరా అవుతూనే ఉంది!

ఉసురు తీస్తున్న సర్కారీ దవాఖానా మందులు

మూడేళ్లుగా నాణ్యతా పరీక్షలకే దిక్కు లేదు
ల్యాబ్‌కు వెళ్లకుండానే రోగుల కడుపులోకి 205 రకాల మందుల్లో 75 శాతం ఇలాంటివే
ప్రాణాలు కాపాడే ఔషధాలపై పరీక్షలు కరువు
ఏ మాత్రమూ పట్టించుకోని సర్కారు
చోద్యం చూస్తున్న ఆరోగ్య శాఖ, డీసీఏ

గుండం రామచంద్రారెడ్డి

సర్కారీ ఆస్పత్రుల మందులు మింగడమంటే ఆరోగ్యంతో ప్రాణాంతక జూదమాడటంగా మారిపోయింది. జబ్బు నయమైందా.. రోగి అదృష్టం. లేదంటే ప్రాణాలు హరీ. పాశ్చాత్య దేశాల్లో పశువుల మందులను కూడా ప్రయోగశాలల్లో ఒకటికి పదిసార్లు పరీక్షించి గానీ మార్కెట్లోకి విడుదల చేయరు. కానీ మన రాష్ట్రంలోనేమో మనుషులకిచ్చే ఔషధాలకు కూడా పరీక్షలు జరిపే దిక్కు లేదు. పై ఉదంతంలోని రేబిస్ వ్యాక్సిన్ మాత్రమే కాదు.. రాష్ట్రంలోని సర్కారీ దవాఖానాల్లో వాడుతున్న 75 శాతం మందులదీ ఇదే పరిస్థితి! వాటికి పరీక్షలు జరుగుతున్నాయా, అవి నాణ్యమైనవేనా, వాడితే దుష్ఫలితాలొస్తున్నాయా, అసలా మందులు పనిచేస్తున్నాయా వంటి మౌలికాంశాలను కూడా సర్కారు పూర్తిగా గాలికొదిలేసింది. తయారీ సంస్థో, డిస్ట్రిబ్యూటరో ఇచ్చినవే మాత్రలు. వాటిని గుడ్డిగా కొనేయడం, నేరుగా పేద రోగులకు అంటగట్టడం.. ఇదే రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) కర్తవ్యంగా మారింది. కనీసం వైద్య ఆరోగ్య శాఖ గానీ, ఔషధ నియంత్రణ సంస్థ గానీ దీన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నాణ్యతా పరీక్షలు పూర్తయి, నివేదిక వచ్చాకే మందులను రోగులకు సరఫరా చేయాలని చట్టం చెబుతున్నా వాటికి పట్టడం లేదు. తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో జనరిక్ మందులను తక్కువ ధరకే కొని కూడా విధిగా పరీక్షలు చేశాకే పంపిణీకి అనుమతిస్తుంటే.. మన దగ్గర మాత్రం ఎక్కువకు కొని, పరీక్షలే లేకుండా రోగుల మీదకు వదులుతున్నారు. ఇలాంటి నాణ్యత లేని మందుల వాడకం ఎక్కువై, దానివల్ల మూత్రపిండాల సమస్యలతో రోగులు అల్లాడుతున్నారని నివేదికలన్నీ ఘోషిస్తున్నా సర్కారులో మాత్రం స్పందన శూన్యం.

మూడేళ్లుగా పరీక్షలు నిల్


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారీ ఆస్పత్రులకు మందులను సేకరించి, సరఫరా చేసే బాధ్యత ఏపీఎంఎస్‌ఐడీసీది. సుమారు 205 రకాల సాధారణ మందులు, 28 రకాల యాంటీబయోటిక్స్ మందులు, 10 రకాల ఐవీ ఫ్లూయిడ్స్, 202 రకాల శస్త్రచికిత్సల ఉపకరణాలను ఇది సరఫరా చేస్తోంది. ఇందుకు ఏటా రూ.380 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటన్నింటికీ సంబంధించి ప్రతి బ్యాచ్‌నూ ముందే అనాలసిస్ (పరీక్ష)కు పంపి, అవి నాణ్యమైనవని తేలాకే రోగుల కోసం సరఫరా చేయాలి. కానీ గత మూడేళ్లుగా ఈ మందులు అసలు పరీక్షలకే నోచుకోవడం లేదు. జరిగిన ఒకటీ అరా పరీక్షలూ తూతూమంత్రంగానే ముగుస్తున్నాయి. పైగా వాటి ఫలితాలు కూడా రోగులు వాడిన ఏడాదికి గానీ రావడం లేదు! వాటిలో పలు మందులు నాణ్యమైనవి కావని తేలిన సందర్భాలకూ కొదవ లేదు. 2011లో విడుదలైన హెచ్‌ఐవీ టెస్ట్ కిట్‌లు, మిథైల్ ఎర్గోమెట్రైన్, రానిటిడైన్, సిప్రోఫ్లాక్సాసిన్, డొపామిన్, అమోక్సిసిలిన్ క్లావనిక్ వంటి మందులు నాసిరకపువని అవి మార్కెట్లోకి వెళ్లిన ఆర్నెల్ల తర్వాత నివేదికలు వచ్చాయి! ఆలోపు వాటిని వాడిన రోగుల పరిస్థితేమిటో ఆ దేవునికే తెలియాలి. ఇవే కాదు.. దీర్ఘకాలిక రోగాల నుంచి, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడే లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను కూడా అసలు పరీక్షలకే పంపడం లేదంటే నమ్మి తీరాల్సిందే! కంపెనీలో తయారవడం, నేరుగా ఆస్పత్రులకు వెళ్లడం.. నిత్యం ఇదే తంతు. దీనిపై నిఘా వ్యవస్థ లేదు. నాణ్యతా పరీక్షల్లేవు. ఎవరూ ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. హెచ్‌ఐవీ రోగులకు వాడే ఎసిక్లోవిర్‌తో పాటు కళ్ల ఇన్‌ఫెక్షన్, గుండె సమస్యలు, గర్భకోశ వ్యాధులు, మధుమేహం, పాముకాటు తదితరాలకు వాడే అతి ముఖ్యమైన మందుల్లో 75 శాతం దాకా అసలు పరీక్షల ముఖమే చూడకుండా నేరుగా ప్రభుత్వాసుపత్రులకు, అక్కడ్నుంచి రోగుల కడుపులోకి వెళ్తున్నాయి! రాష్ట్రంలో ఉన్నవి రెండే ల్యాబొరేటరీలు. ఒకటి ఐటీఎల్, రెండోది పీఆర్‌కే. వీటిలో ఏటా 50 రకాలకు మించి నాణ్యతా పరీక్షలు జరగవంటే.. మన మందులను ఎంతమేరకు పరిశీలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పైగా ఏపీఎంఎస్‌ఐడీసీ పరిధిలో పనిచేస్తున్న అనాలసిస్ వింగ్‌కు అధికారే లేడు! టెండర్లకు సవాలక్ష నియమాలు పెట్టి, పలు కంపెనీలపై అనర్హత వేటు వేసి, అస్మదీయ కంపెనీలకు మాత్రమే ఆర్డర్లిచ్చే అధికారులు, సదరు మందుల అనాలసిస్‌కు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు.


మాకు పంపడంలేదు

‘‘ప్రభుత్వాసుపత్రులకు సరఫరా అయ్యే మందులను డ్రగ్ కంట్రోల్ పరిధిలోని రెండు ల్యాబ్‌లను కాదని ప్రైవేటు ల్యాబ్‌లకు ఏపీఎంఎస్‌ఐడీసీ పంపుతోంది. కాబట్టి దాంతో మాకు సంబంధం లేదు’’
- ఆర్.పి.ఠాకూర్, ఔషధ నియంత్రణ శాఖ డెరైక్టర్ జనరల్

ల్యాబ్‌లకు వస్తున్నవి 30 శాతమే


‘‘రెండు ల్యాబ్‌లే ఉన్నందువల్ల మందుల పరీక్షల్లో జాప్యం (బ్యాక్‌లాగ్) ఏర్పడుతోంది. త్వరలో మరో 4 ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత అన్ని మందులనూ ల్యాబ్‌లకు పంపి, పరీక్షించాకే మార్కెట్లోకి అనుమతిస్తాం’’

-శ్రీనివాస్, బయోమెడికల్ ఇంజనీర్, అనాలసిస్ వింగ్ ఇన్‌చార్జి
ఎన్‌ఎస్‌క్యూ అంటే నాసిరకమైనవి (నాట్ స్టాండర్డ్ క్వాలిటీ). కానీ ఈ రిపోర్టులు వచ్చేనాటికే పై మందులన్నీ జనంలోకి వెళ్లి ఆరు నెలలు దాటింది!

అంటే దాదాపుగా 75 శాతం మందులు ప్రయోగశాలల ముఖమే చూడకుండా నేరుగా రోగుల కడుపులోకి వెళ్తున్నాయి

తమిళనాట ప్రతి మందూ పరీక్షకు వెళ్లాల్సిందే!

తమిళనాడులో ఒక్క మందు కూడా పరీక్ష జరగకుండా జనంలోకి వెళ్లదు. 6 నెలల ముందే మందులకు ఆర్డరిస్తారు. ఆ వెంటనే తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ వాటిని పూర్తిస్థాయిలో పరీక్షిస్తుంది. ఇందుకు సొంతగా పెద్ద ల్యాబ్ ఉంది. ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ పరీక్షలకు అనుమతిస్తారు. మూడు నెలల్లోపే రిపోర్టులు వస్తాయి. ఆ తర్వాతే ఆస్పత్రులకు పంపిస్తారు. నాసిరకమని తేలితే తిప్పి పంపుతారు. ఇంతా చేసి మన రాష్ట్రంలో కంటే ప్రతి మాత్రనూ తమిళనాడులో 20 శాతం తక్కువ ధరకే

HUNT OF PSYCHO KONDAPALLI FORT







సైకో సాంబ కోసం విస్తృత గాలింపు

అన్వేషణలో 300మంది పోలీసులు

7/14/2012 1:13:00 AM

ఇబ్రహీంపట్నం(కృష్ణా), గుంటూరు, న్యూస్‌లైన్: రాచకుంట సాంబశివరావు అలియాస్ సైకో సాంబ పోలీసుల్ని పరుగుపెట్టిస్తున్నాడు. చిక్కినట్టే చిక్కి కొండపల్లి ఖిల్లాపై పరారైన సాంబశివరావు కోసం 300మంది గుంటూరు, కృష్ణా జిల్లాల పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ పరిధిలో శుక్రవారం ముమ్మరంగా గాలించారు. సైకో తప్పించుకుని కొండపై నుంచి జారుకుంటూ కిందకు వెళ్లిపోయినట్లు నిర్ధారించారు.

ఖిల్లా పరిసర ప్రాంతాల గురించి అతనికి బాగా తెలిసి ఉంటుందని, అందుకే పోలీసులకు మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి పరారయ్యాడని భావిస్తున్న పోలీసు అధికారులు పరిసర గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. రిజర్వు ఫారెస్టుని ఆనుకుని ఉన్న మూలపాడు, జూపూడి, కేతనకొండ, పరిటాల, కంచికచర్ల, జి.కొండూరు తదితర గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించారు. అడవిలో ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా నిశితంగా పరిశీలించాకే వదలిపెడుతున్నారు. ఖిల్లాకు ఆనుకుని ఉన్న కాలనీల్లో కూడా వీఆర్వోల సాయంతో గాలిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తుంటే పట్టుకుని వెంటనే పోలీసులకు అప్పగించాలని కొండపల్లిలో దండోరా వేయించారు. కొండపల్లి ఎస్టీ కాలనీలో నేరస్వభావం కలిగిన కొందరు వ్యక్తులపై నిఘా వేశారు. గతంలో ఎన్‌కౌంటర్‌కు గురైన గజదొంగ అడపా వెంకన్న కొండపల్లిలో కొద్దిరోజులు తలదాచుకున్నాడు. ఖిల్లాపై పరారైన సాంబశివరావు కూడా కొండపల్లిలో ఎవరిదైనా సహకారం తీసుకుని ఉంటాడా.. అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.

కాళ్లకు బేడీలున్న వ్యక్తిని చూసిన మహిళ


కాళ్లకు బేడీలున్న ఒక వ్యక్తి శుక్రవారం సాయంత్రం కుంటుతూ అడవి నుంచి శాంతినగర్ మీదుగా వెళ్లటం చూసినట్లు ఒక మహిళ పోలీసు అధికారులకు తెలిపింది. నిందితుడు శాంతినగర్ వరకు వచ్చాడంటే రెలైక్కి పరారై ఉండవచ్చని, లేకపోతే విజయవాడ నగరం వైపు వెళ్లి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సైకో సాంబశివరావు తమ ప్రాంతంలో ఉన్నాడని మీడియా ద్వారా తెలుసుకున్న స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అతడు మాయమైన ప్రదేశానికి సమీపంలోనే జూపూడిలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. సాం బశివరావు వ్యవహారంతో కళాశాలలకు వచ్చే విద్యార్థినులు భయపడుతున్నారు.


మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌కు నామమాత్రపు ఎస్కార్టా?


నాలుగు జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న సాంబశివరావుకు పోలీసులు నామమాత్రంగా ఎస్కార్‌‌ట ఏర్పాటుచేసి తీసుకెళ్లడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 2005 నుంచి ఇప్పటివరకు 80కిపైగా కేసులు నమోదయ్యాయి. సైకోని పట్టుకుంది మంగళగిరి రూరల్ పోలీసులు కాగా అర్బన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ప్రస్తుతం పోలీసు బాస్‌ల వద్ద పంచాయితీ సాగుతోంది. కాగా, కొండ పరిసర ప్రాంతాలు దట్టంగా ఉండటంతో కూంబింగ్‌కు కొంత ఇబ్బంది ఉందని, సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని గుంటూరు అర్బన్ ఎస్పీ రవికృష్ణ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.

ATTACK ON A GIRL ON ROAD

నడిరోడ్డుపై పైశాచికత్వం

టీనేజీ బాలికను వెంటాడి, దుస్తులు చింపిన ఆకతాయిలు

7/13/2012 11:59:00 PM

- అస్సాంలోని గువాహటిలో ఘోరం
- ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
-నలుగురు నిందితుల అరెస్ట్

గువాహటి: అస్సాంలో ఓ టీనేజీ బాలికపై 16 మంది ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. నడిరోడ్డుపై ఆమెను వెంటాడి, దుస్తులు చింపి పైశాచికానందం పొందారు. ఇంత జరుగుతున్నా స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన గువాహటిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గువాహటి-షిల్లాంగ్ రోడ్డులోని ఓ బార్‌లోకి ఐదుగురు పరిచయస్తులతో (ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు) కలసి ఓ బాలిక వెళ్లింది. అయితే అక్కడ వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో బార్ సిబ్బంది వారిని బయటకు వెళ్లగొట్టారు.

ఈ పరిస్థితిని అదనుగా తీసుకున్న ఆకయితాలు ఆమెపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇంటర్నెట్‌లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఈ వికృత చేష్టల వీడియో క్లిప్పింగ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడం...టీవీ చానళ్లు పదేపదే ఆ వీడియోను ప్రసారం చేయడంతో అస్సాం ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం వరకూ నలుగురిని అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఆలస్యంగా స్పందించారన్న మీడియా ప్రశ్నలపై అస్సాం డీజీపీ జయంతా నారాయణ్ చౌధురి మండిపడ్డారు. నేరం జరిగిన చోటల్లా వెంటనే ప్రత్యక్షం కావడానికి సాధ్యం కాదని, పోలీసులేమీ కోరిన వెంటనే నగదు అందించే ఏటీఎం కార్డుల వంటి వారు కాదని డీజీపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, డీజీపీ వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి చిదంబరం ఖండించారు. బాలికపై వికృతచేష్ట ఘటనను ఎవరూ కూడా తేలికగా కొట్టిపారేయడానికి వీల్లేదని చిదంబరం చండీగఢ్‌లో వ్యాఖ్యానించారు.


ఈశాన్య రాష్ట్రాల యువతులపై దేశ రాజధానిలో జరిగే లైంగిక దాడులను పట్టించుకోని ఢిల్లీలోని మీడియా, తాజా ఉదంతంపై రాద్ధాంతం చేస్తోందని... అత్యాచారాలకు ఢిల్లీయే రాజధానిగా మారిందని మరో పోలీసు ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలను కూడా చిదంబరం తప్పుబట్టారు. కాగా, అస్సాంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని..అందువల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అన్నా బృందం సభ్యుడు అఖిల్ గొగోయ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై విచారణకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.

IAS SHALL BE SHOT DEAD

రోడ్డు మీద కాల్చేయాలి: టీజీ

అధికారులపై మంత్రి టీజీ తీవ్ర వ్యాఖ్యలు

7/14/2012 1:38:00 AM

వారికి తల బిరుసు, మాట వినరు.. కుర్చీలకు అతుక్కొని పోతారంటూ ఐఏఎస్‌లపై తీవ్ర విమర్శలు
పని చేయని వెధవలంతా హానెస్ట్ అనే బోర్డు తగిలించుకుంటారని వ్యాఖ్య
సీఎంకు, తమకు పనిచేయాలనే తపన ఉన్నా, ఐఏఎస్‌ల వల్లే ఇబ్బందులు వస్తున్నాయన్న మంత్రి వెంకటేష్

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: పని చేయని అధికారులను రోడ్డు మీద నిలబెట్టి కాల్చేయాలని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులపై ఒంటికాలి మీద లేచారు. ‘‘వారికి తల బిరుసు.. మాట వినరు.. కుర్చీలు వదలరు’’ అంటూ మండిపడ్డారు. పని చేయని వెధవలందరూ


నిజాయితీపరులుగా చలామణి అవుతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కర్నూలు నగరంలో కొత్తగా నిర్మించిన మైనర్ ఇరిగేషన్ శాఖ డీఈ కార్యాలయం భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులకు సమష్టిగా పనులు చేయాలనే తపన ఉన్నా, కొందరు ఐఏఎస్ అధికారుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనులను వేగవంతంగా చేయాలనే తపన ప్రభుత్వానికి ఉంది. అయితే, ఆర్థిక శాఖ మా స్పీడుకు బ్రేకు వేస్తోంది. అక్కడ ఉన్నది ఐఏఎస్ ఆఫీసర్లు. వారికి తల బిరుసు. వారికి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. సరిగా మాట్లాడరు. మాట వినరు. ఏప్రిల్‌లో కేటాయించిన బడ్జెట్‌ను ఇప్పటికీ రిలీజ్ చేయకుండా తీవ్ర అలసత్వం చేస్తున్నారు’’ అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.


‘‘మైనర్ ఇరిగేషన్ శాఖలో ఒక పనికిమాలిన ఐఏఎస్ ఉంటే చాలు.. పనుల్లో న్యాయం చేయడానికి వీల్లేకుండాపోతోంది. ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ అమెరికా తరహాలో ఉండాలి. అమెరికాలో ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారుల వ్యవస్థను మారుస్తుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కుర్చీలకు అతుక్కుకొని పోతున్నారు. ప్రజల కోసం ఎంతో చేయాలని మాకుంది. అయితే, ఇలాంటి వారి వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. పని చేయని వెధవలంతా హానెస్ట్ అనే బోర్డు తగిలించుకొని కుర్చీలను వదలడంలేదు. ఇలాంటివారికి జీతాలు ఇవ్వడం దండగ’’ అని తీవ్రంగా విమర్శించారు.

వీటికి పరిష్కారం కావాలంటే చట్టంలో మార్పులు చేయాలని చెప్పారు. ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ మధ్య సమన్వయంలేకపోవడంవల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కర్నూలు జిల్లాలో చెరువు కోసం పుల్లారెడ్డి అనే వ్యక్తి 350 ఎకరాలు దానం చేస్తే, అధికారుల తప్పిదాల వల్ల ఇప్పటికీ చెరువును తవ్వుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఆ భూమి స్వాధీనానికి సంబంధించిన ఫైల్‌ను మూలన పడేశారని, దాని కోసం మా స్థాయిలో ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.