Tuesday 19 June 2012

జడ్జి పట్టాభి అరెస్ట్



గాలికి బెయిల్ కేసులో ముడుపుల ఆరోపణలు



అదుపులోకి తీసుకున్న ఏసీబీ
రోజంతా విచారణ
సాయంత్రానికి కోర్టులో హాజరు

హైదరాబాద్, న్యూస్‌లైన్: న్యాయమూర్తి టి.పట్టాభిరామారావును అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం అరెస్టుచేశారు. తెల్లవారుజామునే ఆయన ఇంటి తలుపు తట్టిన ఏసీబీ అధికారులు... అప్పుడే నిద్రలేచిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించారు. వైద్యపరీక్షల అనంతరం ఆయనను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎదుట హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మొదటి అదనపు జడ్జిగా పనిచేసిన పట్టాభి రామారావును ఏసీబీ అరెస్టు చేయడం న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా కూడా కొన్నాళ్లపాటు విధులను నిర్వర్తించిన పట్టాభి రామారావు అదే కోర్టులో నిందితుడిగా బోనులో నిల్చోవాల్సి రావడం గమనార్హం. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ ఇచ్చిన వ్యవహారంలో జడ్జి పట్టాభిరామారావు ముడుపులు తీసుకున్నట్లు వెలుగులోకి రావడంతో హైకోర్టు ఆయనను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ ఫిర్యాదు మేరకు ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అధికారులు ఈనెల 9న ఆయనపై ఐపీసీ సెక్షన్ 120(బి), 34, 104, 219, అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 8, 9, 13(1)(డి), 13(2) ప్రకారం కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న పట్టాభిరామారావును మంగళవారం అరెస్టుచేయగా, ఆయన కుమారుడు రవిచంద్ర, రిటైర్డు జడ్జి టీవీ చలపతిరావును ఇప్పటికే అరెస్టుచేసిన విషయం తెలిసిందే.

తెల్లవారు జామునే...


అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం తెల్లవారు జాము 5.30 గంటలకే బంజారాహిల్స్ జడ్జిల నివాస సముదాయంలోని జడ్జి పట్టాభిరామారావు ఇంటి తలుపుతట్టారు. అప్పుడే నిద్రలేచిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం ఏసీబీ డీఎస్పీ రఘుపతిగౌడ్ నేతృత్వంలో కొద్దిసేపు అక్కడే విచారించారు. అనంతరం ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. గంట సమయం తరువాత మొజంజాహీ మార్కెట్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అయనకు అక్కడే అల్పాహారం అందించారు. అనంతరం ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ చీఫ్ కె. సంపత్‌కుమార్ నేతృత్వంలో ఆయనను సుదీర్ఘంగా విచారించారు. మధ్యాహ్నం భోజనం అనంతరం కూడా విచారణ కొనసాగింది. సాయంత్రం 4.35 గంటలకు ఏసీబీ కార్యాలయం నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ బీపీ, మధుమేహం వంటి వైద్య పరీక్షల అనంతరం ఐదున్నర గంటలకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి తీసుకుని వెళ్లారు.

ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎస్.జగన్నాథం అప్పటికే బెంచ్ దిగివెళ్లారు. దీంతో పట్టాభిరామారావును జడ్జి చాంబర్‌లోకి తీసుకుని వెళ్లారు. పట్టాభిరామారావు పది నిమిషాలపాటు జడ్జి ఎదుట నిల్చునే ఉన్నారు. బాగా నీరసంగా ఉండటంతో బయటకు వచ్చి బంట్రోతు కూర్చునే కుర్చీలో కూర్చున్నారు. పట్టాభిరామారావు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆయన తరఫు న్యాయవాదులు జడ్జికి వివరించారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌కు జడ్జి ఆదేశాలు జారీచేశారు. పట్టాభిరామారావుకు ప్రత్యేక న్యాయస్థానం జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడంతో పూర్తి భద్రత నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు. ఆయనను సాధారణ ఖైదీలతోపాటు మానస సరోవర్ బ్లాక్‌లో ఉంచినట్లు జైలు సూపరింటెండెంట్ కేఎల్ శ్రీనివాసరావు తెలిపారు. రిమాండ్ ఖైదీగా ఉన్న పట్టాభిరామారావుకు యూటీ నంబరు 5834ను కేటాయించారు.


బెంగళూరుకు ఏసీబీ ప్రత్యేక బృందాలు


జడ్జి పట్టాభిరామారావు ముడుపుల వ్యవహారంలో నిందితులుగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి బంధువులను అరెస్టుచేసేందుకు ఏసీబీ ప్రత్యేక బృందాలు బెంగళూరుకు వెళ్లాయి. గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు జి.సోమశేఖరరెడ్డి, ఆయన బంధువు జి.దశరథరామిరెడ్డి, కంప్లీ ఎమ్మెల్యే టీహెచ్ సురేష్‌బాబును నిందితులుగా ఏసీబీ పేర్కొన్న విషయం తెలిసిందే. వారిని అరెస్టుచేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దీంతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉన్న నాచారం రౌడీషీటర్ యాదగిరిరావు, జూనియర్ న్యాయవాది ఆదిత్య కోసం కూడా ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు.


పట్టాభి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు: ఏసీబీ


ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ మంజూరు వ్యవహారంలో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పట్టాభిరామారావు ఇతరులతో కుట్రపన్నారని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో ఆరోపించింది. బెయిల్ మంజూరు విషయంలో పట్టాభి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డి అక్రమంగా లబ్ధి పొందారని పేర్కొంది. గాలికి బెయిల్ మంజూరు విషయంపై పట్టాభితో మాట్లాడేందుకు మాజీ జడ్జి టీవీ చలపతిరావును యాదగిరి సెంట్రల్ కోర్టు హాల్‌లో సోమశేఖర్‌రెడ్డికి పరిచయం చేశారని తెలిపారు. బెయిల్ మంజూరు కుట్రలో గాలి సోమశేఖర్‌రెడ్డి, జి.దశరథరామిరెడ్డి, ఎమ్మెల్యే సురేష్‌బాబు, పట్టాభి కుమారుడు రవిచంద్ర, టీవీ.చలపతిరావు, న్యాయవాది ఆదిత్య, యాదగిరిలతో కలిసి పట్టాభి కుట్రలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ‘‘బెయిల్ మంజూరు విషయంలో మే 6నుంచి ఇతర నిందితులతో పట్టాభి సంప్రదింపులు జరిపారు. బెయిల్ డీల్ కుదిరిన తర్వాత పట్టాభి తన ఫోన్‌ను వాడడం మానేసి కుమారుడు రవిచంద్ర ఫోన్‌ను వాడారు.


బెయిల్ మంజూరు చేసిన తర్వాత పట్టాభి మాజీ జడ్జి చలపతిరావుతో 175 సెకన్లపాటు, యాదగిరితో చలపతిరావు 392 సెకన్లు మాట్లాడారు. బెయిల్ మంజూరు తర్వాత యాదగిరి, చలపతిరావులు కొత్త నంబర్లను వాడారు. కార్పొరేషన్ బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఐదు లాకర్లను పొందారు. ఇందులో రెండు లాకర్ల తాళాలను పట్టాభి కుమారుడు రవిచంద్ర నుంచి సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ లాకర్ల నుంచి రూ.1.6 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. బెయిల్ డీల్ కుదిర్చినందుకు చలపతిరావు రూ.1.14 కోట్లు తీసుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన యాదగిరికి రూ.9.5 లక్షలు ఇచ్చారు’’ అని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో వివరించింది. కేసు ప్రాథమిక దశలో ఉందని... ఆధారాలను తారుమారు చేయకుండా, సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండేందుకు పట్టాభిని సాయంత్రం 4 గంటలకు అరెస్టు చేశామని పేర్కొన్నారు. మంగళవారం తెల్లవారు జామునే ఆయనను అదుపులోకి తీసుకున్నప్పటికీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయనను అరెస్టు చేసినట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు పేర్కొనడం గమనార్హం.

No comments:

Post a Comment