Tuesday 19 June 2012

ఉమేష్ సస్పెన్షన్







డీజీ స్థాయి అధికారిపై వేటు ఇదే ప్రథమం
ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో ఉమేష్‌పై అరెస్ట్ వారెంట్ జారీ
మూడ్రోజులుగా కనిపించకుండాపోయిన ఐపీఎస్ అధికారి
చర్యలకు డీజీపీ సిఫారసు, ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: గోదావరి వ్యాలీ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేదీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సస్పెన్షన్ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా హైదరాబాద్ వదలి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ చరిత్రలో డెరైక్టర్ జనరల్ స్థాయి అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేయటం ఇదే ప్రథమం. ఉమేష్‌కుమార్ సస్పెన్షన్ వ్యవహారం రాష్ట్ర పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 1977 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఉమేష్‌కుమార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్‌గా ఉన్న సమయంలో డీజీపీ పోస్టు కోసం పోటీపడ్డారు. డీజీపీ పోస్టుకు అప్పుడు పోటీలో ఉన్న దినేష్‌రెడ్డి, ఆయన భార్య పేర్లతో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నారని ఆరోపిస్తూ పార్లమెంట్ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ సంతకం ఫోర్జరీ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు పంపినట్లు ఉమేష్‌కుమార్‌పై ఆరోపణలున్నాయి.

ఎంపీ ఎం.ఎ.ఖాన్ ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఆదేశాలతో సీఐడీ గత ఏడాది కేసు నమోదుచేసింది. ఫోర్జరీ కేసులో ఉమేష్‌కుమార్‌పై సీఐడీ నాంపల్లి కోర్టులో అభియోగపత్రాన్ని కూడా దాఖలుచేసింది. ఆ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరుకాకపోవడంతో ఉమేష్‌కుమార్‌పై కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీచేయడంతో శుక్రవారం నుంచి ఆయన కనిపించకుండా పోయారు. వారంట్ కాపీలను అందిచేందుకు వెళితే ఉమేష్ పరారయ్యారని, ఉద్దేశపూర్వకంగానే తప్పించుకున్నారని సీఐడీ డీఎస్‌పీ అమర్‌కాంత్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఉమేష్ సచివాలయంలోని ఆయన కార్యాలయానికి కూడా రాలేదు. సీఐడీ అధికారుల కళ్లుగప్పి తప్పించుకున్నారని, తీవ్రమైన దుష్ర్పవర్తన కలిగి ఉన్నందున ఆయనను సస్పెండ్ చేయాలని డీజీపీ దినేష్‌రెడ్డి ప్రభుత్వానికి సిఫారసు చేశారు. సమాచారం అందించకుండా విధులకు గైర్హాజరుకావటంపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉంది. ఉమేష్‌కుమార్ శనివారం నుంచి విధులకు హాజరుకావటంలేదని, ముందస్తు సమాచారం అందించలేదని సాధారణ పరిపాలన విభాగం అధికారులు సీఎం కార్యాలయానికి నివేదిక అందించారు. ఆ నివేదికను సీఎం కిరణ్ పరిశీలించిన అనంతరం సస్పెన్షన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఉమేష్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

No comments:

Post a Comment