Tuesday 19 June 2012

ఆ నియామకం చెల్లదు












డీజీపీగా దినేష్‌రెడ్డి ఎంపికపై క్యాట్ సంచలన తీర్పు
‘సుప్రీం’ తీర్పునకు విరుద్ధంగా ఆయన్ను ఎంపిక చేశారు
అర్హులైన వారి జాబితాను వారం రోజుల్లో యూపీఎస్‌సీకి పంపాలి... మూడు వారాల్లో నూతన డీజీపీ నియామకాన్ని పూర్తి చేయాలని సర్కారుకు ఆదేశం

హైదరాబాద్, న్యూస్‌లైన్: డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకం చట్టవిరుద్ధమని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) సంచలన తీర్పు వెలువరించింది. ప్రకాష్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా దినేష్‌రెడ్డిని డీజీపీగా ఎంపిక చేశారని క్యాట్ పేర్కొంది. నూతన డీజీపీ నియామకాన్ని మూడు వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్యాట్ మంగళవారం ఆదేశించింది. డీజీపీ పోస్టుకు అర్హులైన అధికారుల జాబితాను వారం రోజుల్లో యూపీఎస్‌సీకి పంపాలని స్పష్టం చేసింది. ఈ జాబితాలో అర్హులైన ముగ్గురిని గుర్తించి యూపీఎస్‌సీ ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని తెలిపింది. యూపీఎస్‌సీ జాబితా అందిన వారం రోజుల్లో నూతన డీజీపీ నియామకాన్ని పూర్తిచేయాలని రాష్ట్ర సర్కారుకి జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే నూతన డీజీపీ నియామకం చేపట్టే వరకూ డీజీపీగా దినేష్‌రెడ్డి విధులు నిర్వహించేందుకు క్యాట్ అనుమతించింది.

డీజీపీగా దినేష్ నియామకం చట్టవిరుద్ధమంటూ గత ఏడాది జూలై 12న హోంశాఖ ముఖ్య కార్యదర్శి పి.గౌతంకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను రణబీర్‌సింగ్, కాంతయ్యలతో కూడిన క్యాట్ ధర్మాసనం విచారించిన అనంతరం ఈ మేరకు తీర్పును వెలువరించింది. డీజీపీ ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం పదేపదే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని, 2009 నుంచి ముగ్గురు డీజీపీల ఎంపికలో సుప్రీంకోర్టు, హైకోర్టు, క్యాట్ తీర్పులను.. ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ గౌతంకుమార్ క్యాట్‌ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రకాష్‌సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదని గౌతంకుమార్ తరఫు న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. గిరీష్‌కుమార్, అరవిందరావులను డీజీపీగా ఎంపిక చేసినప్పుడు కూడా ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని, ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ క్యాట్, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం ధిక్కరించిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం... డీజీపీ పోస్టుకు అర్హులైన అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్‌సీకి పంపాలని, వారు సూచించిన అధికారుల్లో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేయాలని వివరించారు.

No comments:

Post a Comment