Friday 13 July 2012

VEGETABLES ON TERRACE




గజం స్థలంలో 288 మొక్కలు

ఇంటి పంట



ఇది ‘పెరటి మొక్కల పొద’ మ్యాజిక్
ముచ్చటగొలుపుతున్న ‘పెరటి మొక్కల గోడ’!
అర్బన్ కిచెన్ గార్డెన్‌కు
అధునాతన అన్‌బ్రేకబుల్ కుండీల సొబగు

నాలుగు కూరగాయ మొక్కలో, ఆకుకూరలో ఇంటి పట్టున పెంచుకుందామంటే పెద్దగా చోటు లేదని చింతిస్తున్నారా? బాల్కనీలో ఉన్నదల్లా రెండు గజాల స్థలమే. ఆ కాస్త ఖాళీలో ఎన్ని కుండీలు పెట్టగలం.. ఎంతని ఆకుకూరలు పెంచగలం అననుకుంటున్నారా..?

ఇదుగో చక్కటి ఉపాయం... వర్టికల్ పెరటి తోట!

అరకిలో బరువుండే చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలు ఉంటాయి. వాటిని పట్టి ఉంచడానికి కొన్ని ప్లాస్టిక్ ఫ్రేమ్‌లు ఉంటాయి. వీటిని ఉపయోగించి ఎవరికి వారు ‘పెరటి మొక్కల పొద’ (బయో వాల్)లను, ‘పెరటి మొక్కల గోడ’ (గ్రీన్ వాల్)లను పదంటే పది నిమిషాల్లో సృష్టించుకోవచ్చు.
ఆకారం, ఎత్తు, పొడవు, వెడల్పు.. ఎలా కావాలంటే ఆ విధంగా కుండీలను అమర్చుకునే వీలుంది. గుండ్రంగా పొద మాదిరిగా ఫ్రేమ్స్‌ను కలిపి, చుట్టూ ప్లాస్టిక్ కుండీలు తగిలించవచ్చు. లేదంటే ప్లైవుడ్‌కు ఈ ఫ్రేమ్స్‌ను కోరిన వెడల్పు, ఎత్తు, పొడవులలో సులువుగా బిగించుకోవచ్చు. తర్వాత చిటికెలో కుండీలు తగిలించవచ్చు.

వారానికో, నెలకో.. మీకు తోచినప్పుడు ఈ ఫ్రేమ్స్‌ను మార్చి.. మీ అత్యాధునిక పెరటి తోటకు పది నిమిషాల్లో కొత్త రూపు దిద్దుకోవచ్చు. ఈ మార్పులన్నీ నిపుణులెవరో వచ్చి చెయ్యక్కర్లేదు. ఫ్రేమ్‌ల అమరికను ఒక్కసారి పరికించి చూస్తే చాలు.. ఎవరికివారే పెరటి తోటను బిగించుకోవచ్చు!

అన్నిటికీ మించి.. ప్రస్తుతం కొద్ది రోజులు ఏ పెరటి తోటా వద్దు అనుకుంటే... ఫ్రేమ్‌లను, కుండీలను తీసేసి.. ప్యాక్‌చేసి అటకపై దాచిపెట్టుకోవచ్చు. మళ్లీ ఎప్పుడంటే అప్పుడు పది నిమిషాల్లో బిగించుకొని.. ఆకుకూరల విత్తనాలో, కూరగాయల విత్తనాలో చల్లుకోవచ్చు. మధ్యలో పూలమొక్కలూ పెట్టుకోవచ్చు.

సులువుగా మార్చుకోవచ్చు

ఇంటి పెరటిలోనో, ఇంటి పైనో, అపార్ట్‌మెంట్ల బాల్కనీల్లో.. ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ బయో వాల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి హాల్‌లో (నీడ పట్టున) అందంగా ‘ఫ్రేమ్ గార్డెన్’ను గోడకు వేలాడదీయొచ్చు. అటువంటి ఫ్రేమ్‌లు మరి కొన్నిటిని ఆరుబయటో, బాల్కనీల్లోనో (ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు రోజులు నీడ పట్టున ఫ్రేమ్‌లకు ఉన్న మొక్కల కుండీలను ఎండ తగిలే చోటుకు తరలించి.. ఎండ తగిలే చోట ఫ్రేమ్‌లకు ఉన్న మొక్కల కుండీలను నీడపట్టున ఫ్రేమ్‌లకు అతి సులువుగా తగిలించుకోవచ్చు.

ముంబైకి చెందిన జేకేడీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఈ సరికొత్త ఆలోచనతో అర్బన్ గార్డెనింగ్ గ్రీన్ వాల్‌కు రూపకల్పన చేసింది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఉద్యాన ఎక్స్‌పోలో ఈ ఫ్లెక్సిబుల్ వర్టికల్ గార్డెన్ సిస్టమ్స్‌ను దేశంలోనే మొట్టమొదటి సారిగా జేకేడీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ప్రదర్శించింది.

6 అంగుళాల కుండీ!

అర్బన్ గార్డెనింగ్ గ్రీన్ వాల్‌లో ఫ్రేమ్‌కు అమర్చే కుండీ చేతిలో అమిరిపోయేంత చిన్నది. దీని లోతు 6 అంగుళాలు, వెడల్పు 4 అంగుళాలు. మట్టి, మొక్కతో కలిపి ఒక్కో కుండీ బరువు అర కేజీకి మించదు. ఒక్కో ఫ్రేమ్‌కు 3 కుండీలుంటాయి. అటువంటి ఫ్రేమ్‌లను ఎట్లా కావాలంటే అట్లా అమర్చుకోవచ్చు.

కొబ్బరి పొట్టు ఎరువు బెస్ట్

శుద్ధిచేసిన కొబ్బరి పొట్టు ఎరువును వాడి నిక్షేపంగా మొక్కలు పెంచుకోవచ్చునని కోనసీమలో నర్సరీల వాళ్లు అనుభవపూర్వకంగా చెప్తున్నారు. కొన్ని కంపెనీలు శుద్ధిచేసిన కొబ్బరి పొట్టు ఎరువును మార్కెట్లో విక్రయిస్తున్నాయి కూడా.

గజం వర్టికల్ గార్డెన్‌లో 288 మొక్కలు..!

ఒక్కో ఫ్రేమ్ (3 ఖాళీ కుండీలతో కలిపి) 570 గ్రాముల బరువు ఉంది. కొబ్బరి పొట్టులో చిన్న మొక్కను ఉంచిన తర్వాత ఒక్కో ఫ్రేమ్ బరువు కిలోన్నర ఉంది. అంటే మొక్క ఉన్న ఒక్కో కుండీ బరువు అర కేజీ అన్నమాట. 4 ఫ్రేమ్‌లను (అంటే 12 మొక్కలను) అమర్చేందుకు 3 అడుగుల స్థలం సరిపోతుంది. 16 ఫ్రేమ్‌లను గుండ్రంగా అమర్చి.. వాటిపై 6 వరుసలుగా ఫ్రేమ్‌లను నిలువుగా బిగిస్తే (288 కుండీలతో).. చదరపు గజం స్థలంలోనే దాదాపు 9 అడుగుల ఎత్తులో ‘పెరటి మొక్కల పొద’ (వర్టికల్ గార్డెన్) తయారవుతుంది. గుండ్రంగా ఉండే ఈ ‘పెరటి మొక్కల పొద’ను అన్ని వైపుల నుంచి ఎండ తగిలే వీలున్న ఆరుబయటో, మేడ మీదో ఏర్పాటు చేసుకుంటే బావుంటుంది.

వాల్ గార్డెన్ సంగతి..
ఫ్రేమ్‌లను రెండు వరుసలుగా ప్లైవుడ్‌కు బిగిస్తే వాల్ గార్డెన్ సిద్ధం. ఉదయం గాని, మధ్యాహ్నం నుంచి గాని రోజుకు ఐదారు గంటలు ఎండ తగిలే చోట గోడకు ఆనించిన ప్లైవుడ్‌కు ఫ్రేమ్స్ బిగించి కుండీలు పెట్టుకుంటే చాలు. ఆకుకూరలు, కూరగాయల సాగుకు ఈ చిన్న కుండీలు భేషుగ్గా ఉంటాయనడంలో సందేహం లేదు.

విలక్షణమైన గ్రీన్‌వాల్

మరో విలక్షణ నమూనా వాల్ గార్డెన్‌ను కూడా ఈ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. 16 మొక్కలు పెంచుకోవడానికి వీలుగా ఉండే ట్రే(మాడ్యూల్)లను తయారుచేసింది. 12.5 సెంటీమీటర్ల మందాన ఉండే ట్రేలో కొబ్బరి పొట్టు లేదా మట్టి, కంపోస్టు మిశ్రమం పోసి మొక్కలు పెట్టుకున్న తర్వాత.. దాన్ని గోడ పక్కన నిలబెట్ట వచ్చు. ఆకాశం వైపు చూడాల్సిన మొక్కలు... అడ్డంగా వంగి పక్కకు పొడుచుకొచ్చినట్టుంటాయి. ట్రేని అలాగే ఉంచి పై నుంచి లోపలికి నీరు పోయవచ్చు.

‘అన్‌బ్రేకబుల్ మెటీరియల్‌తో తయారుచేశాం’

(12 కుండీలను కలిగి ఉండే) 4 ఫ్రేమ్‌ల ప్యాకెట్ ఖరీదు పన్నులతో కలిపి రూ.900. రవాణా ఖర్చులు, ఆక్ట్రాయ్ అదనం. మొదటి ఎక్స్‌పోలోనే తమ ఉత్పత్తులు హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయని జేకేడీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ యజమాని కుమార్‌పాల్ షా ‘ఇంటి పంట’ ప్రతినిధితో చెప్పారు. బయో వాల్‌ను ఎండలో పెట్టుకున్నా ఏళ్ల తరబడి మన్నిక ఉండేలా, అన్‌బ్రేకబుల్‌గా, నాణ్యంగా తయారుచేశామని ఆయన తెలిపారు. తమకు దేశంలో ఎక్కడా డీలర్లు లేరని, వినియోగదారులు తమను నేరుగా (022- 23713340, 32923340) సంప్రదించవచ్చన్నారు.

(రేపు మళ్లీ ఇక్కడే కలుద్దాం)

- ‘సాక్షి’ స్పెషల్ డెస్క్

‘ఇంటి పంట’ల సాగు ఎంతో మేలు

నేడు ప్రపంచ పెరటి తోటల దినోత్సవం



కూరగాయలు, పండ్లలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలు ప్రజారోగ్యానికి గొడ్డలి పెట్టులా తయారయ్యాయన్న స్పృహ వినియోగదారుల్లో పెరుగుతోంది. ఈ దృష్ట్యా స్థలాభావం ఉన్నప్పటికీ.. ఇంటి ముందో, వెనుకో, మేడ మీదో, బాల్కనీలోనో కుండీలు, మడుల్లో ఉన్నంతలో ఆరోగ్యదాయకంగా కూరగాయలు పెంచుకుందామన్న ప్రయత్నాలు నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇటీవల ముమ్మరమయ్యాయి.

2008 లెక్కల ప్రకారం.. ప్రపంచంలో అత్యధికులు పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. మన దేశంలో 30 శాతం మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారని తాజా అంచనా. మరో 25 ఏళ్లలో ఇది 50 శాతానికి పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి లెక్కగడుతోంది. వ్యవసాయానికి దూరంగా ఇంత ఎక్కువ మంది పట్టణాలు, నగరాల్లో జీవిస్తుంటే.. ఆహారోత్పత్తి, ఆహార రవాణా, ఆహార వ్యవస్థల నిర్వహణపై వత్తిడి ఎంత తీవ్రంగా పెరుగుతుందో వేరే చెప్పనక్కరలేదు. ఈ వత్తిడిని కొంత మేరకైనా తగ్గించడానికి అర్బన్ అగ్రికల్చర్‌ను ప్రోత్సహించడం అత్యవసరం. పట్టణాలు, నగరాల్లో నివసిస్తూ కూడా ఇప్పటికే 80 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో ఇంటి పంటల సాగు చేపట్టారని ఒక అంచనా. భారతీయ గృహాల్లో తలసరి పౌష్టికాహార వినియోగం తక్కువగా ఉండడం.. పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్న జనాభా సంఖ్య పెరుగుతున్నందున అర్బన్ అగ్రికల్చర్‌ను ప్రోత్సహించాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొంది.


సేంద్రియ ‘ఇంటి పంట’ల సాగును వ్యాప్తిచేసేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఉద్యమ స్ఫూర్తితో కృషి చేస్తున్నారు. ముంబై నగరంలో ముంబై పోర్టు ట్రస్టు మేడల మీద, పబ్లిక్ పార్కుల కేంద్రంగా సిటీ ఫార్మింగ్‌లో ఆచరణాత్మక శిక్షణను అర్బన్ లీవ్స్ ఇండియా ట్రస్టు నిరంతరం చేపడుతోంది. కంపోస్టు తయారీ నుంచి వివిధ పంటల సాగు వరకూ అత్యాధునిక మెళుకువలను నగరవాసులకు పరిచయం చేస్తోంది.


బెంగళూరులో ఈ దిశగా గత కొన్ని సంవత్సరాలుగా గార్డెన్ సిటీ ఫార్మర్స్ ట్రస్టు, అమి ఫౌండేషన్, విఠల్ మాల్య సైంటిఫిక్ రీసెర్చ్ ఫౌండేషన్, డాక్టర్ విశ్వనాధ్ తదితరుల ఆధ్వర్యంలో మేడలపై, బాల్కనీల్లో సేంద్రియ పెరటి తోటల సాగుపై చక్కని కార్యసదస్సులు క్రమం తప్పకుండా సాగుతున్నాయి. హుబ్లీలో దేశ్‌పాండే ఫౌండేషన్ విశేష కృషి చేస్తోంది. ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, ఆసక్తి ఉన్న యువతను ఇంటి పంటల కన్సల్టెంట్లుగా తీర్చిదిద్దుతోంది.


తిరువనంతపురం నగరంలో ఈ ఏడాది ఆగస్టు 2న కేరళ హార్టీకల్చర్ మిషన్ ఆధ్వర్యంలో రూ.12 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో కూరగాయల సాగుపై వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. నగరపాలక సంస్థ తొలి దశలో 15 వేల ఇళ్ల మేడలపై కూరగాయల సాగును ప్రోత్సహిస్తోంది. ప్రతి ఇంటికీ కూరగాయ మొక్కల సాగుకు 25 సిల్ఫాలిన్ బ్యాగులు, విత్తనాలు లేదా నారు, గార్డెనింగ్ పరికరాలు ఉచితంగా అందజేస్తున్నారు. కాలనీ సంఘాల ద్వారా ఆసక్తి ఉన్న గృహస్తులను ఎంపిక చేస్తున్నారు. నగరంలో మేడలపై కూరగాయల సాగును ప్రోత్సహించడానికి ప్రత్యేక డాక్యుమెంటరీలను అందుబాటులో ఉంచడం, సేంద్రియ సేద్యంలో అనుభవం ఉన్న నిపుణుల సలహాలను అందుబాటులోకి తేవడం ద్వారా కేరళ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది.


‘సాక్షి’ ప్రచార యజ్ఞం


‘ఇంటి పంట’ల ప్రచార యజ్ఞంతో ‘సాక్షి’ దినపత్రిక వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టింది. సేంద్రియ ఇంటి పంటల సాగులో శాస్త్రీయ మెళుకువలను, వినూత్న పోకడలను.. వంటింటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ పద్ధతులను ‘ఇంటి పంట’ శీర్షిక పాఠకులకు పరిచయం చేసింది. హైదరాబాద్ మహా నగరంలోని 15 ప్రాంతాల్లో కార్య సదస్సులను నిర్వహించడంతో వేలాది ప్రజలు ఇంటి పంటల సాగుపై దృష్టిసారించారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం(సీఎస్‌ఏ), అగ్రి హార్టికల్చరల్ సొసైటీ, హైదరాబాద్ గోస్ గ్రీన్ తదితర సంస్థల నిపుణులు ప్రజలను చైతన్య పరిచే కృషిలో పాలుపంచుకున్నారు. గూగుల్ గ్రూప్.కామ్‌లో ఇంటి పంట గ్రూప్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఇంటి పంటల సాగుదారులకు ఇంటర్ నెట్‌లో అనుభవాలు పంచుకునే అవకాశం వేదిక అందుబాటులోకి వచ్చింది. అర్బన్ అగ్రికల్చర్‌పై ప్రత్యేక శిక్షణా విభాగాలను ప్రారంభించేందుకు సీఎస్‌ఏ, ధ్యానహిత సొసైటీ తదితర సంస్థలు ప్రయత్నిస్తుండడం విశేషం.


నివాస గృహాల వద్ద, హౌసింగ్ కాలనీలు, పాఠశాల లు, కళాశాలల వద్ద ఖాళీస్థలాల్లో సేంద్రియ పెరటి తోట లు సాగుచేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ నర్సరీని అర్బన్ అగ్రికల్చర్ నమూనా వనరుల కేంద్రంగా అభివృద్ధి చేయడం ప్రయోజనకరం. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లోని పార్కులలో అర్బన్ అగ్రికల్చర్ శిక్షణ విభాగాలను, నమూనా ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఉపక్రమిం చాలి. ఈ విషయంలో కేరళ ప్రభుత్వ కృషిని మన రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.


-పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్



వంటే కాదు.. పంటలూ ఇంటివే

సాక్షి ‘ఇంటి పంట’ స్ఫూర్తితో ఉద్యాన శాఖ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం

7/14/2012 12:59:00 AM

ఏడాది పొడవునా అందుబాటులో రసాయనాలులేని కూరగాయలు
మేడలపై కూరగాయల సాగుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్ లో కిచెన్ గార్డెన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
లబ్ధిదారుల ఇంటి వద్దకే విత్తనాలు, ఇతర ఉపకరణాలు
యూనిట్ వ్యయం రూ.14 వేలు.. 50% సబ్సిడీ


హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నగరవాసులు ‘ఆహా.. ఏమి రుచి’ అని కూరగాయల గురించి అనుకోవడం ఎప్పుడో మరచిపోయారు. ఒకపక్క విపరీతంగా పెరిగిన ధరలు.. పూర్తిగా రసాయనాల వినియోగంతో పెరిగిన కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉండటం ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లో కమ్మని కూరగాయల కోసం తపనపడేవారికి ఓ శుభవార్త. ఆరోగ్యదాయకమైన కూరగాయలు తమకు అందుబాటులో ఉంచుకునే అవకాశం జంటనగరాల ప్రజలకు అందివస్తోంది. స్వల్ప పెట్టుబడి.. కాస్త ఆసక్తితో పాటు కొంత సమయం వెచ్చిస్తే చాలు... కోరుకున్న కూరగాయలు తాజాగా రెడీయన్నమాటే. ‘ఇంటి పంట’ పేరిట ‘సాక్షి’ గత ఏడాది ప్రారంభించిన ప్రచారోద్యమం సాధించిన విజయం ఇది. ‘ఇంటి పంట’ శీర్షిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది ఇంటిపట్టునే కూరగాయల సాగును ప్రారంభించారు. దీనిపై హైదరాబాద్ నగరవాసులకు అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో ‘సాక్షి’ నిర్వహించిన ‘ఇంటి పంట’ వర్క్‌షాపులు నగరవాసుల్లో ఆరోగ్యదాయకమైన ఆహారంపై ఆసక్తిని రేకెత్తించాయి. ‘ఇంటి పంట’ స్ఫూర్తితో రాష్ట్ర ఉద్యాన శాఖ కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో నగరవాసులు తమ దాబాల టైపై కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం వచ్చింది.
50 శాతం సబ్సిడీ


దేశంలోనే తొట్టతొలిగా హైదరాబాద్ నగరంలో మేడలపై కూరగాయల సాగు ప్రోత్సాహానికి పైలట్ ప్రాజెక్టు మంజూరైంది. ఇందుకోసం రూ.3.39 కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పైలట్ ప్రాజెక్టును శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ సి.వి.ఎస్.కె.శర్మ, ఉద్యాన శాఖ కమిషనర్ రాణి కుముదిని పబ్లిక్ గార్డెన్స్‌లోని హార్టీకల్చర్ ట్రైనింగ్ సెంటర్‌లో లాంఛనంగా ప్రారంభించారు. కాలనీ సంక్షేమ సంఘాల ద్వారా ఆయా ప్రాంతాల్లోని లబ్ధిదారులను గుర్తించి, నర్సరీ ఏజన్సీల ద్వారా కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేయించాలని నిర్ణయించినట్లు రాణి కుముదిని వెల్లడించారు. కాగా నలుగురు కుటుంబానికి ఏడాదికి సరిపడా ఆకుకూరలు, కూరగాయలు లభించేలా మేడపైన వంద చదరపు అడుగుల విస్తీర్ణంలో (ఒక యూనిట్) టై కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు రూ.14 వేలు ఖర్చవుతుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. లబ్ధిదారులు తమ వంతుగా రూ. 7 వేలను తమ ప్రాంతంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సరీ ఏజన్సీకి చెల్లించి, మేడపై కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేయించుకోవాలి. ఇలా ఏర్పాటైన గార్డెన్లు సత్ఫలితాలనిస్తున్నాయని నిర్థారించుకున్న తర్వాత ఈ ఏజన్సీలకు ప్రభుత్వం యూనిట్‌కు రూ.7 వేల చొప్పున సబ్సిడీ (50%)ని చెల్లిస్తుంది.


ఇంటి వద్దకే విత్తనాలు, కంపోస్టు, ఇతర సామగ్రి


ఈ పథకంలో విత్తనాలు, కంపోస్టు- మట్టి మిశ్రమం కోసం, ఇటుకలు, ఇతరత్రా పరికరాల కోసం నగరంలో ఎక్కడెక్కడో వెదుక్కోవాల్సిన శ్రమ లేదు. వాస్తవానికి చాలామందికి ఇందుకు సంబంధించిన దుకాణాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు. ఈ కారణంగానే ఆసక్తి ఉన్నా వెనుకంజ వేసేవారు. ఇప్పుడు మాత్రం కిచెన్ గార్డెన్‌కు అవసరమయ్యే ఉపకరణాలతోపాటు సాంకేతిక సలహాలను కూడా లబ్ధిదారుల ఇంటి వద్దకు వచ్చి అందించే అవకాశాన్ని ఈ పైలట్ ప్రాజెక్టు కల్పిస్తోంది. ఉద్యాన శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సంయుక్తంగా అమలు చేసే ప్రాజెక్టు కింద కాలనీ సంక్షేమ సంఘాల ద్వారా లబ్ధిదారులను గుర్తించి, నర్సరీ ఏజన్సీల ద్వారా కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేయిస్తారు. లబ్ధిదారులు పబ్లిక్ గార్డెన్స్ ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్‌కు దరఖాస్తు చేసుకుంటే చాలు. కావాల్సిన కంపోస్టు, మట్టి, విత్తనాలు, ఇటుకలు తదితర ఉపకరణాలన్నిటినీ ఈ నర్సరీ ఏజన్సీలే మొబైల్ వ్యాన్ల ద్వారా సమకూర్చుతాయి. లబ్ధిదారులకు తొలుత శిక్షణ ఇవ్వడంతో పాటు తదనంతరం పాటించాల్సిన సాంకేతిక సలహాలు కూడా అందిస్తాయి. నెలకోసారి ఈ ఏజన్సీ ప్రతినిధులు ప్రతి గార్డెన్‌ను సందర్శించి తగిన సూచనలతోపాటు కంపోస్టు తదితరాలను అందిస్తారు.


నగరంలో ప్రాంతాల వారీగా నర్సరీ ఏజన్సీలను వారం రోజుల్లోగా గుర్తించి ఆయా ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్ల వద్ద జాబితాలను పొందుపరుస్తామని ఉద్యానశాఖ కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. విభిన్న జీవన నేపథ్యం నుంచి వచ్చిన నగరవాసులకు కూరగాయల పెంపకంలో శిక్షణ ఇవ్వడంతో ద్వారా ఏడాది పొడవునా తోడ్పాటును అందించాలన్నదే ఈ పైలట్ ప్రాజెక్టు ఉద్దేశమని ఆమె వివరించారు. ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను పెంచడం ద్వారా నగరాన్ని ఎడిబుల్ సిటీగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. సాక్షి ప్రారంభించిన ‘ఇంటి పంట’ గూగుల్ గ్రూప్స్ (intipanta@ googlegroups.com) ద్వారా కిచెన్ గార్డెనింగ్‌పై ఆచరణాత్మకమైన సలహాలు అందుతున్నాయని ఆమె ప్రశంసించారు.


ఈ కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ అనూరాధ, ఉద్యానశాఖ డిప్యూటీ డెరైక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, వివిధ కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పలువురు ‘ఇంటిపంట’ గూగుల్ గ్రూప్స్ సభ్యులు పాల్గొన్నారు. ‘ఇంటి పంట’ శీర్షికన సాక్షి ప్రచురించిన వ్యాసాలను సాక్షి వెబ్ సైట్ (sakshi.com)హోమ్ పేజీలో ‘ఇంటి పంట’ లోగోను క్లిక్ చేయడం ద్వారా చదవొచ్చు.

2 comments: