Friday 13 July 2012

FAKE ENCOUNTERS OF SITARAMANJANEYULU

ఎన్‌కౌంటర్లు కావు.. ఖాకీ వేట
ఎస్పీగా సీతారామాంజనేయులు సంహారకాండ
నప్పుబట్టిన జాతీయ హక్కుల కమిషన్
16 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం

గుంటూరు, కర్నూలు ఎస్పీగా చెలరేగిన పీఎస్ఆర్
రెండేళ్లలో 19 మంది కాల్చివేత
నక్సల్స్, ఫ్యాక్షనిస్టులంటూ హత్యలకు 'చట్టబద్ధత'
కోర్టుకు వెళ్లకముందే 'ఖాకీ తీర్పు'.. మరణ శిక్ష
నరమేధంపై నిలదీసిన మానవ హక్కుల వేదిక
జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
కమిషన్‌ను కదిలించిన న్యాయవాది చంద్రశేఖర్
రామాంజనేయులుపై కేసు పెట్టాలి: చంద్రశేఖర్
కాలేజీకి పోయిన కుర్రాళ్లు శవాలై ఇంటికి వస్తారు. పొద్దున్నే పొలానికి పోయిన రైతు మళ్లీ ఆ ఊళ్లో ఎవరికీ కనిపించడు. అప్పటిదాకా టీ కొట్టు దగ్గర బాతాఖానీ కొట్టిన చోటామోటా నేత కాస్తా ఆలివ్‌గ్రీన్ దుస్తుల్లోకి మారిపోయి గుర్తుతెలియని మృతదేహంగా మారతాడు. ఏదో పని మీద బయట ఊరికి బయలుదేరిన భర్త, తీవ్రవాది ముద్రతో తెల్లారిపోతాడు. సినిమాకు స్నేహితులతో బయలుదేరిన కొడుకు, వారందరితో పాటు రహస్య సమావేశంలో ప్రత్యక్షమై, భీకర ఎదురు కాల్పుల్లో మరణిస్తాడు.. నియంతల ఏలుబడిలోని లాటిన్ అమెరికా దేశాల్లోనో, ప్రైవేట్ సాయుధ సైన్యాల కనుసన్నల్లోని బీహార్, ఉత్తరప్రదేశ్‌లలోనో జరిగిన ఘటనలు కావివి. ద గ్రేట్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు పి. సీతారామాంజనేయులు జరిపించిన నరమేధంలోని కొన్ని నెత్తుటి పుటలివి. 2000 ప్రాంతంలో ఆయన కర్నూలు, గుంటూరు ఎస్పీగా ఉండగా.. వివిధ కేసుల్లోని నిందితులను.. 'ఆత్మరక్షణ' పేరిట, నక్సలైట్ల సాకుతో చంపించిన తీరిది. కోర్టులు, చట్టాలు, సర్వీస్ నిబంధనలన్నింటినీ తోసిరాజని.. తుపాకీ చేతపట్టి సాగించిన వేట తీరిది. ఈ కిరాతకానికి ఎన్‌కౌంటర్ అని పేరు..ఖాకీ ముఖానికి గల హింస పార్శ్వానికి పరాకాష్ఠలా సాగిన ఈ బూటకపు ఎన్‌కౌంటర్ల తీరుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం నివ్వెరపోయింది. మానవ హక్కుల వేదిక నేత, న్యాయవాది బి. చంద్రశేఖర్ రెండు దశాబ్దాల పోరుకు స్పందించింది. "ఇంత దారుణంగా చంపిపడేసి.. ఎన్‌కౌంటర్ అంటారా?'' అని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు డిపార్టుమెంట్‌పై ఫైర్ అయింది. మొత్తం 19 కేసుల్లో 16 కేసులను 'బూటకం'గా తేల్చి బాధితులకు రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్‌కౌంటర్ కేసుల్లో ఈస్థాయిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
పి.సీతారామాంజనేయులు..వివాదాస్పద పోలీస్ అధికారి. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులపై రౌడీయిజం చే యడం మొదలు, విజయవాడ కమిషనర్‌గా.. నగర శాంతి భద్రతలను పక్కనబెట్టి, ఈవ్‌టీజర్ అవతారం ఎత్తడం దాకా ఎన్నో వివాదాల్లో చిక్కుకొని 'వేటు'కు గురైన ఖాకీ బాస్. కానీ, ఆయన సర్వీస్‌లోని మరో చీకటి కోణం ఇప్పుడు వెలుగు చూసింది. 2000 నుంచి 2002 మధ్య కాలంలో గుంటూరు, కర్నూలు ఎస్పీగా ఉండగా ఎడాపెడా చేయించిన 'ఎన్‌కౌంటర్లు' ఆయన మెడకు చుట్టుకున్నాయి. చేసిన పాపం చేతులు కడుక్కుంటే పోదు అన్నట్టు..ఆయా ఎన్‌కౌంటర్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టి సారించింది. వాటన్నింటిని దాదాపు బూటకం గా తేల్చి మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున పరిహా రం అందజేయాలని ప్రభుత్వానికి సూచించిం ది. దీంతో..బాధితులను గుర్తించి పరిహారం పంపిణీ చేసే పని ఇప్పటికే మొదలైంది. పలు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన కాలంలో సీతారామాంజనేయులు బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడినట్టు గుంటూరుకు చెందిన మానవ హక్కుల వేదిక నేత, న్యాయవాది బి చంద్రశేఖర్ 2002 జూలై 11న ఎన్‌హెచ్ ఆర్‌సీకి ఫిర్యాదు చేయడంతో తీగ కదిలింది. అప్పట్లో జరిగిన మొత్తం 19 ఎన్‌కౌంటర్ కేసుల వివరాలను కమిషన్‌కు ఆయన ససాక్ష్యంగా సమర్పించా రు. దీనిపై గత ఏడాది నవంబర్‌లో కమిషన్ విచారణ పూర్తి చేసింది. 16 కేసుల్లో ఎన్‌కౌంటర్ బూటకమని తేల్చి ంది. అందులో 10 కేసులు కర్నూలు, ఆరు గుంటూరులో నమోదయ్యాయి. వీటిలో ఒక్కటిమాత్రమే నక్స ల్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసు. కాగా, బా ధితులకు పాక్షిక న్యాయం మాత్రమే అం దినట్టు చంద్రశేఖర్ అభిప్రా యపడ్డారు. బాధ్యులకు శిక్ష పడేదాకా పోరు ఆగదని, అవ సరమైతే సుప్రీంకోర్టుకు వెళతా మన్నారు. మరోవైపు, సీతారామాంజ నేయులను శిక్షించాలంటూ బాధితులు హైకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు.

కర్నూలులో నెత్తురు పారిందిలా..

2000 మే 16: డోన్‌లో టీడీపీ సానుభూతిపరుడు ఏరుకుల శ్రీను (30) కాల్చివేత.

జూన్ 12: మామిడాలపాడు వద్ద టీడీపీ సానుభూతిపరులు పిక్కిలి బాబు (30), బోయ వెంకట రాముడు(35), వెంకటేశ్వర్లు (32) కాల్చివేత. వీరందరినీ ఓ కేసులో కర్నూలు జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకు వెళ్లే క్రమంలో చంపేశారు.

జూలై 14: కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకి రామలింగ ప్రసాద్ (28)ను హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అదుపులోకి తీసుకొని బనగానపల్లి వద్ద కాల్చివేశారు.

జూలై 22: మహానంది మండలం గాజుపల్లి వద్ద నల్లబోతుల సుంకన్న కాల్చివేత. నిజానికి, అంతకు వారం క్రితం సోదరి ఇంటి నుంచి పోలీసులు సుంకన్నను మాయం చేశారు. నకిలీ నక్సలైట్ అనేది పోలీసుల అభియోగం.

సెప్టెంబర్ 23: కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, హత్య, పలు చోరీ కేసుల్లో నిందితుడు బసివిరెడ్డి అశ్వద్ధ్దరెడ్డి (35)ని ప్రకాశం జిల్లా కనిగిరిలో అదుపులోకి తీసుకొని కర్నూలు జిల్లా బేతంచర్ల వద్ద కాల్చేశారు.

అక్టోబర్ 22: హత్యాయత్నం కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన కల్లూరి వెంకటేశ్వర్లు (35)ను ఇంటి నుంచి తీసుకెళ్లి చంపేశారు.

డిసెంబర్ 4: మాజీ సీఎం కోట్ల విజయ భాస్కరరెడ్డి తనయుడు సూర్య ప్రకాష్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వస్తున్న కాంగ్రెస్‌కు చెందిన కిష్టన్న (45) రాముడు అలియాస్ రసూల్ (42)ను తీసుకెళ్లి కాల్చివేత. వారిద్దరిపై ఫ్యాక్షనిస్టు ముద్ర ఉంది.

2001 ఏప్రిల్ 2: తల్లితో పాటు హోటల్‌లో ఉన్న టీడీపీ కార్యకర్త కొమరవోలు రమేష్‌ను పట్టుకొని చెన్నమొహట్టిపల్లి వద్ద కాల్చేశారు.

ఆగస్టు 2: సిపిఐ నేత, పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడు గుండ్లకొండ శ్రీనివాసులుని (35) గ్రామంలో పట్టుకొని దేవరకొండ వద్ద కాల్చేశారు.

నవంబర్ 11: రాజబాబు అలియాస్ రాజు (35)ను పిన్నాపురం వద్ద చంపేశారు.

గుంటూరు గుండెల్లో తూటా..

2002 మే 4: పలు దోపిడీ కేసుల్లో నిందితుడు మేడా వెంకటేశ్వర్లు (40)ను మణికొండలోని ఇంటి వద్ద నుంచి మే 1న తీసుకెళ్లి నాలుగు రోజుల తరువాత సీతానగరం వద్ద కాల్చేశారు.

జూన్ 4: దోపిడీ కేసుల్లో రిమాండ్ ఖైదీలు కోదాటి శ్రీను (36), కంపా శ్రీను (30) తాడిగిరి సురేష్ (35), మేచర్ల లక్ష్మణరావు (40)లను సత్తెనపల్లి సబ్ జైల్ నుంచి గుంటూరు కోర్టుకు తీసుకువస్తూ పేరేచర్ల వద్ద కాల్చేశారు.

జూలై 7: పీపుల్స్‌వార్ పార్టీ కార్యకర్త దున్నా సుధాకర్ (24)ను నాగార్జున సాగర్ వద్ద అదుపులోకి తీసుకొని రెండు రోజుల తరువాత పల్నాడులోని పసర్లపాయి తండా వద్ద కాల్చేశారు.

ఇదేం ఎన్‌కౌంటర్..?

పేరు మేడా వెంకటేశ్వర్లు. విజయవాడ-వెంకటపాలెం రోడ్డుపై 2002 మే 4న తెల్లవారు జామున 3 గంటలకు తారసపడ్డాడు. ఆరా తీసేందుకు సబ్-ఇన్‌స్పెక్టర్ కె సుధాకర్ ఆగమన్నాడు. కానీ వెంకటేశ్వర్లు ఆగకపోగా కాల్పులు జరపడంతో ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. రివాల్వర్‌లో బుల్లెట్లు అయిపోయేంతవరకూ కాల్పులు జరిపి తర్వాత మళ్లీ లోడ్ చేసుకుని కాల్పులు కొనసాగించాడు. కాల్పులు ఆగిపోయాక వెళ్లి చూస్తే వెంకటేశ్వర్లు చనిపోయి ఉన్నాడు''.. ఇదీ ఎస్ఐ 'ఆత్మరక్షణ' కథనం. కానీ, ఈ కథనాన్ని కమిషన్ తోసిపుచ్చింది. " వెంకటేశ్వర్లు శరీరంపై ఉన్న గాయాలను బట్టి చూస్తే మీ కథనం నమ్మశక్యంగా లేదు.

ఛాతీకి గురిపెట్టి నాలుగు సార్లు కాల్పులు జరిపినట్లు పోస్టుమార్టం రిపోర్టు చెబుతోంది. నాలుగూ ఛాతీకే ఎలా తగిలాయి? నిస్సహాయుడై ఉన్నప్పుడు ఎస్ఐ వరుసగా కాల్పులు జరిపి ఉంటాడు. ఇది మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే'' అని తేల్చి చెప్పింది. అంతేకాదు.. సదరు ఎన్‌కౌంటర్లపై పదే పదే నోటీసులు పంపినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. కాగా, ఈ ఉదం తం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని రాష్ట్ర పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

బలయింది బడుగులే..

మొత్తం 19 మందిలో ఇద్దరు తప్ప అందరూ బడుగులే. వారిలో 9 మంది ఎరుకలు కాగా, ఐదుగురు బోయలు. ముగ్గురు దళితులు. వీరిలో కొందరు నేరస్తులూ ఉండొచ్చు. తీవ్ర నేరాభియోగాలు నమోదై ఉండవచ్చు. కానీ, ఈ కారణంగా పిట్టల్లా కాల్చి చంపే హక్కు పోలీసులకు లేదనేది హక్కుల నేతల వాదన. కానీ, తాను పనిచేసిన ప్రతి జిల్లాలోనూ సీతారామాంజనేయులు..మనుషులను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించారనేది కమిషన్ ఆదేశాలతో తేలిపోతోంది.
- ఆన్‌లైన్, న్యూఢిల్లీ, హైదరాబాద్, గుంటూరు, కర్నూలు

No comments:

Post a Comment