Friday 13 July 2012

IAS SHALL BE SHOT DEAD

రోడ్డు మీద కాల్చేయాలి: టీజీ

అధికారులపై మంత్రి టీజీ తీవ్ర వ్యాఖ్యలు

7/14/2012 1:38:00 AM

వారికి తల బిరుసు, మాట వినరు.. కుర్చీలకు అతుక్కొని పోతారంటూ ఐఏఎస్‌లపై తీవ్ర విమర్శలు
పని చేయని వెధవలంతా హానెస్ట్ అనే బోర్డు తగిలించుకుంటారని వ్యాఖ్య
సీఎంకు, తమకు పనిచేయాలనే తపన ఉన్నా, ఐఏఎస్‌ల వల్లే ఇబ్బందులు వస్తున్నాయన్న మంత్రి వెంకటేష్

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: పని చేయని అధికారులను రోడ్డు మీద నిలబెట్టి కాల్చేయాలని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులపై ఒంటికాలి మీద లేచారు. ‘‘వారికి తల బిరుసు.. మాట వినరు.. కుర్చీలు వదలరు’’ అంటూ మండిపడ్డారు. పని చేయని వెధవలందరూ


నిజాయితీపరులుగా చలామణి అవుతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కర్నూలు నగరంలో కొత్తగా నిర్మించిన మైనర్ ఇరిగేషన్ శాఖ డీఈ కార్యాలయం భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులకు సమష్టిగా పనులు చేయాలనే తపన ఉన్నా, కొందరు ఐఏఎస్ అధికారుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనులను వేగవంతంగా చేయాలనే తపన ప్రభుత్వానికి ఉంది. అయితే, ఆర్థిక శాఖ మా స్పీడుకు బ్రేకు వేస్తోంది. అక్కడ ఉన్నది ఐఏఎస్ ఆఫీసర్లు. వారికి తల బిరుసు. వారికి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. సరిగా మాట్లాడరు. మాట వినరు. ఏప్రిల్‌లో కేటాయించిన బడ్జెట్‌ను ఇప్పటికీ రిలీజ్ చేయకుండా తీవ్ర అలసత్వం చేస్తున్నారు’’ అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.


‘‘మైనర్ ఇరిగేషన్ శాఖలో ఒక పనికిమాలిన ఐఏఎస్ ఉంటే చాలు.. పనుల్లో న్యాయం చేయడానికి వీల్లేకుండాపోతోంది. ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ అమెరికా తరహాలో ఉండాలి. అమెరికాలో ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారుల వ్యవస్థను మారుస్తుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కుర్చీలకు అతుక్కుకొని పోతున్నారు. ప్రజల కోసం ఎంతో చేయాలని మాకుంది. అయితే, ఇలాంటి వారి వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. పని చేయని వెధవలంతా హానెస్ట్ అనే బోర్డు తగిలించుకొని కుర్చీలను వదలడంలేదు. ఇలాంటివారికి జీతాలు ఇవ్వడం దండగ’’ అని తీవ్రంగా విమర్శించారు.

వీటికి పరిష్కారం కావాలంటే చట్టంలో మార్పులు చేయాలని చెప్పారు. ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ మధ్య సమన్వయంలేకపోవడంవల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కర్నూలు జిల్లాలో చెరువు కోసం పుల్లారెడ్డి అనే వ్యక్తి 350 ఎకరాలు దానం చేస్తే, అధికారుల తప్పిదాల వల్ల ఇప్పటికీ చెరువును తవ్వుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఆ భూమి స్వాధీనానికి సంబంధించిన ఫైల్‌ను మూలన పడేశారని, దాని కోసం మా స్థాయిలో ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment