Friday 13 July 2012

BAN ON LOVE IN A UP VILLAGE








ప్రేమ వివాహాలపై నిషేధం



7/14/2012 12:03:00 AM

- మహిళల షాపింగ్ కుదరదు
- యూపీ గ్రామంలో తాలిబన్ తరహా నిషేధాజ్ఞలు

బాఘ్‌పట్: ఉత్తరప్రదేశ్‌లో తాలిబన్ల తరహా సంస్కృతి బుసలుకొట్టింది. ఓవైపు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే ఉత్తరప్రదేశ్ బాఘ్‌పట్ జిల్లాలోని అసారా గ్రామంలో ఉన్న ఖాప్ పంచాయతీ మాత్రం అతివల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా... వారి స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా అర్థంలేని ఆంక్షలు విధించింది. ప్రేమ పెళ్లిళ్లను నిషేధించడంతోపాటు 40 ఏళ్లలోపు మహిళలు షాపింగ్‌కు వెళ్లరాదని, ఇళ్ల బయట సెల్‌ఫోన్లు వాడరాదని హుకుం జారీ చేసింది. అలాగే బయటకు వెళ్లేటప్పుడు మహిళలంతా తప్పనిసరిగా తలను వస్త్రంతో కప్పుకోవాలని ఆదేశించింది. బుధవారంనాటి సమావేశంలో ఖాప్ పంచాయతీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తమ ఆదేశాలు ధిక్కరించి ఎవరైనా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే గ్రామం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఈ విషయంపై ప్రశ్నించేందుకు మోకిమ్, ముజాహిద్ అనే ఇద్దరు పంచాయతీ సభ్యులను పోలీసులు గురువారం పిలిపించారు. అయితే, వారిని విడి చిపెట్టాలంటూ అల్లరిమూక ఆందోళనకు దిగింది. అక్కడ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు వెళ్లిన ఇద్దరు పోలీసులపై కూడా అల్లరిమూక దాడి చేసింది. వారి ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టింది.


దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతల విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ బి.పి.సింగ్ లక్నోలో తెలిపారు. ఇంత దుమారం చెలరేగినా యూపీ మంత్రి మొహమ్మద్ ఆజంఖాన్ మాత్రం ఖాప్ పంచాయతీ ఆదేశాలనే వెనకేసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చని... దాన్ని ఎలా అడ్డుకుంటామని విలేకరులకు ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ఇలాంటి ఆదేశాలను బలవంతంగా లేదా చట్టవ్యతిరేకంగా అమలు చేయాలనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.


యూపీ సర్కారు చర్యలు తీసుకోవాలి: చిదంబరం

అసారా గ్రామ ఖాప్ పంచాయతీ ఆంక్షలను కేంద్ర హోంమంత్రి చిదంబరం తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చట్టవ్యతిరేక ఆదేశాలను అమలు చేయాలనుకునే వారిపై యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు చిదంబరం శుక్రవారం చండీగఢ్‌లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సమాజంలో ఇటువంటి వాటికి చోటు లేదన్నారు. ఈ ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ చీఫ్ మమతా శర్మ విచారం వ్యక్తం చేశారు. ఖాప్ పంచాయతీలకు రాజ్యాంగాధికారాలేవీ ఉండవన్నారు. ఆధునిక యుగంలో ఇటువంటి ఆదేశాలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు, ఈ విషయమై తక్షణమే నివేదిక సమర్పించవలసిందిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ బాఘ్‌పట్ జిల్లా అధికారులను ఆదేశించింది.

No comments:

Post a Comment