Friday 13 July 2012

ATTACK ON A GIRL ON ROAD

నడిరోడ్డుపై పైశాచికత్వం

టీనేజీ బాలికను వెంటాడి, దుస్తులు చింపిన ఆకతాయిలు

7/13/2012 11:59:00 PM

- అస్సాంలోని గువాహటిలో ఘోరం
- ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
-నలుగురు నిందితుల అరెస్ట్

గువాహటి: అస్సాంలో ఓ టీనేజీ బాలికపై 16 మంది ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. నడిరోడ్డుపై ఆమెను వెంటాడి, దుస్తులు చింపి పైశాచికానందం పొందారు. ఇంత జరుగుతున్నా స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన గువాహటిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గువాహటి-షిల్లాంగ్ రోడ్డులోని ఓ బార్‌లోకి ఐదుగురు పరిచయస్తులతో (ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు) కలసి ఓ బాలిక వెళ్లింది. అయితే అక్కడ వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో బార్ సిబ్బంది వారిని బయటకు వెళ్లగొట్టారు.

ఈ పరిస్థితిని అదనుగా తీసుకున్న ఆకయితాలు ఆమెపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇంటర్నెట్‌లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఈ వికృత చేష్టల వీడియో క్లిప్పింగ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడం...టీవీ చానళ్లు పదేపదే ఆ వీడియోను ప్రసారం చేయడంతో అస్సాం ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం వరకూ నలుగురిని అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఆలస్యంగా స్పందించారన్న మీడియా ప్రశ్నలపై అస్సాం డీజీపీ జయంతా నారాయణ్ చౌధురి మండిపడ్డారు. నేరం జరిగిన చోటల్లా వెంటనే ప్రత్యక్షం కావడానికి సాధ్యం కాదని, పోలీసులేమీ కోరిన వెంటనే నగదు అందించే ఏటీఎం కార్డుల వంటి వారు కాదని డీజీపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, డీజీపీ వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి చిదంబరం ఖండించారు. బాలికపై వికృతచేష్ట ఘటనను ఎవరూ కూడా తేలికగా కొట్టిపారేయడానికి వీల్లేదని చిదంబరం చండీగఢ్‌లో వ్యాఖ్యానించారు.


ఈశాన్య రాష్ట్రాల యువతులపై దేశ రాజధానిలో జరిగే లైంగిక దాడులను పట్టించుకోని ఢిల్లీలోని మీడియా, తాజా ఉదంతంపై రాద్ధాంతం చేస్తోందని... అత్యాచారాలకు ఢిల్లీయే రాజధానిగా మారిందని మరో పోలీసు ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలను కూడా చిదంబరం తప్పుబట్టారు. కాగా, అస్సాంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని..అందువల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అన్నా బృందం సభ్యుడు అఖిల్ గొగోయ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై విచారణకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.

No comments:

Post a Comment