Tuesday, 19 June 2012

జడ్జి పట్టాభి అరెస్ట్



గాలికి బెయిల్ కేసులో ముడుపుల ఆరోపణలు



అదుపులోకి తీసుకున్న ఏసీబీ
రోజంతా విచారణ
సాయంత్రానికి కోర్టులో హాజరు

హైదరాబాద్, న్యూస్‌లైన్: న్యాయమూర్తి టి.పట్టాభిరామారావును అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం అరెస్టుచేశారు. తెల్లవారుజామునే ఆయన ఇంటి తలుపు తట్టిన ఏసీబీ అధికారులు... అప్పుడే నిద్రలేచిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించారు. వైద్యపరీక్షల అనంతరం ఆయనను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎదుట హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మొదటి అదనపు జడ్జిగా పనిచేసిన పట్టాభి రామారావును ఏసీబీ అరెస్టు చేయడం న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా కూడా కొన్నాళ్లపాటు విధులను నిర్వర్తించిన పట్టాభి రామారావు అదే కోర్టులో నిందితుడిగా బోనులో నిల్చోవాల్సి రావడం గమనార్హం. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ ఇచ్చిన వ్యవహారంలో జడ్జి పట్టాభిరామారావు ముడుపులు తీసుకున్నట్లు వెలుగులోకి రావడంతో హైకోర్టు ఆయనను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ ఫిర్యాదు మేరకు ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అధికారులు ఈనెల 9న ఆయనపై ఐపీసీ సెక్షన్ 120(బి), 34, 104, 219, అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 8, 9, 13(1)(డి), 13(2) ప్రకారం కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న పట్టాభిరామారావును మంగళవారం అరెస్టుచేయగా, ఆయన కుమారుడు రవిచంద్ర, రిటైర్డు జడ్జి టీవీ చలపతిరావును ఇప్పటికే అరెస్టుచేసిన విషయం తెలిసిందే.

తెల్లవారు జామునే...


అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం తెల్లవారు జాము 5.30 గంటలకే బంజారాహిల్స్ జడ్జిల నివాస సముదాయంలోని జడ్జి పట్టాభిరామారావు ఇంటి తలుపుతట్టారు. అప్పుడే నిద్రలేచిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం ఏసీబీ డీఎస్పీ రఘుపతిగౌడ్ నేతృత్వంలో కొద్దిసేపు అక్కడే విచారించారు. అనంతరం ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. గంట సమయం తరువాత మొజంజాహీ మార్కెట్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అయనకు అక్కడే అల్పాహారం అందించారు. అనంతరం ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ చీఫ్ కె. సంపత్‌కుమార్ నేతృత్వంలో ఆయనను సుదీర్ఘంగా విచారించారు. మధ్యాహ్నం భోజనం అనంతరం కూడా విచారణ కొనసాగింది. సాయంత్రం 4.35 గంటలకు ఏసీబీ కార్యాలయం నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ బీపీ, మధుమేహం వంటి వైద్య పరీక్షల అనంతరం ఐదున్నర గంటలకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి తీసుకుని వెళ్లారు.

ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎస్.జగన్నాథం అప్పటికే బెంచ్ దిగివెళ్లారు. దీంతో పట్టాభిరామారావును జడ్జి చాంబర్‌లోకి తీసుకుని వెళ్లారు. పట్టాభిరామారావు పది నిమిషాలపాటు జడ్జి ఎదుట నిల్చునే ఉన్నారు. బాగా నీరసంగా ఉండటంతో బయటకు వచ్చి బంట్రోతు కూర్చునే కుర్చీలో కూర్చున్నారు. పట్టాభిరామారావు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆయన తరఫు న్యాయవాదులు జడ్జికి వివరించారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌కు జడ్జి ఆదేశాలు జారీచేశారు. పట్టాభిరామారావుకు ప్రత్యేక న్యాయస్థానం జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడంతో పూర్తి భద్రత నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు. ఆయనను సాధారణ ఖైదీలతోపాటు మానస సరోవర్ బ్లాక్‌లో ఉంచినట్లు జైలు సూపరింటెండెంట్ కేఎల్ శ్రీనివాసరావు తెలిపారు. రిమాండ్ ఖైదీగా ఉన్న పట్టాభిరామారావుకు యూటీ నంబరు 5834ను కేటాయించారు.


బెంగళూరుకు ఏసీబీ ప్రత్యేక బృందాలు


జడ్జి పట్టాభిరామారావు ముడుపుల వ్యవహారంలో నిందితులుగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి బంధువులను అరెస్టుచేసేందుకు ఏసీబీ ప్రత్యేక బృందాలు బెంగళూరుకు వెళ్లాయి. గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు జి.సోమశేఖరరెడ్డి, ఆయన బంధువు జి.దశరథరామిరెడ్డి, కంప్లీ ఎమ్మెల్యే టీహెచ్ సురేష్‌బాబును నిందితులుగా ఏసీబీ పేర్కొన్న విషయం తెలిసిందే. వారిని అరెస్టుచేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దీంతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉన్న నాచారం రౌడీషీటర్ యాదగిరిరావు, జూనియర్ న్యాయవాది ఆదిత్య కోసం కూడా ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు.


పట్టాభి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు: ఏసీబీ


ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ మంజూరు వ్యవహారంలో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పట్టాభిరామారావు ఇతరులతో కుట్రపన్నారని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో ఆరోపించింది. బెయిల్ మంజూరు విషయంలో పట్టాభి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డి అక్రమంగా లబ్ధి పొందారని పేర్కొంది. గాలికి బెయిల్ మంజూరు విషయంపై పట్టాభితో మాట్లాడేందుకు మాజీ జడ్జి టీవీ చలపతిరావును యాదగిరి సెంట్రల్ కోర్టు హాల్‌లో సోమశేఖర్‌రెడ్డికి పరిచయం చేశారని తెలిపారు. బెయిల్ మంజూరు కుట్రలో గాలి సోమశేఖర్‌రెడ్డి, జి.దశరథరామిరెడ్డి, ఎమ్మెల్యే సురేష్‌బాబు, పట్టాభి కుమారుడు రవిచంద్ర, టీవీ.చలపతిరావు, న్యాయవాది ఆదిత్య, యాదగిరిలతో కలిసి పట్టాభి కుట్రలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ‘‘బెయిల్ మంజూరు విషయంలో మే 6నుంచి ఇతర నిందితులతో పట్టాభి సంప్రదింపులు జరిపారు. బెయిల్ డీల్ కుదిరిన తర్వాత పట్టాభి తన ఫోన్‌ను వాడడం మానేసి కుమారుడు రవిచంద్ర ఫోన్‌ను వాడారు.


బెయిల్ మంజూరు చేసిన తర్వాత పట్టాభి మాజీ జడ్జి చలపతిరావుతో 175 సెకన్లపాటు, యాదగిరితో చలపతిరావు 392 సెకన్లు మాట్లాడారు. బెయిల్ మంజూరు తర్వాత యాదగిరి, చలపతిరావులు కొత్త నంబర్లను వాడారు. కార్పొరేషన్ బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఐదు లాకర్లను పొందారు. ఇందులో రెండు లాకర్ల తాళాలను పట్టాభి కుమారుడు రవిచంద్ర నుంచి సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ లాకర్ల నుంచి రూ.1.6 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. బెయిల్ డీల్ కుదిర్చినందుకు చలపతిరావు రూ.1.14 కోట్లు తీసుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన యాదగిరికి రూ.9.5 లక్షలు ఇచ్చారు’’ అని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో వివరించింది. కేసు ప్రాథమిక దశలో ఉందని... ఆధారాలను తారుమారు చేయకుండా, సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండేందుకు పట్టాభిని సాయంత్రం 4 గంటలకు అరెస్టు చేశామని పేర్కొన్నారు. మంగళవారం తెల్లవారు జామునే ఆయనను అదుపులోకి తీసుకున్నప్పటికీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయనను అరెస్టు చేసినట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు పేర్కొనడం గమనార్హం.

చిట్టా విప్పిన కోలా కృష్ణమోహన్

చంద్రబాబు సన్నిహితులకు మారిషస్‌లో పలు బ్యాంకు ఖాతాలు



ఖాతా నంబర్లతో సహా బయటపెట్టిన నాటి బాబు సన్నిహితుడు
బాబు సింగపూర్ ఖాతా వివరాలను ముందే చెప్పిన కోలా
డాయిషే బ్యాంకులో సి. నాయుడు నారా పేరుతో బాబుకు ఖాతా
అకౌంట్ నంబర్ 2248634590-4985 అని వెల్లడించిన కోలా
ఆ ఖాతాకు తాను రూ. 4 కోట్లు బదిలీ చేసినట్లు ఇటీవలే వెల్లడి
బాబు చీకటి రహస్యాలన్నీ బయటపెడతానని ఆనాడే ప్రకటన
పూర్తి వివరాలను హైకోర్టుకు, ఈడీకి అందిస్తానని స్పష్టీకరణ
కోలా ఆరోపణలు అబద్ధమంటూ వారంలో వివరాలు చెప్తానన్న బాబు
పది రోజులు గడిచినా ఆ ఆరోపణలపై స్పందించని టీడీపీ అధినేత
విదేశీ ఖాతాలపై దర్యాప్తు జరగాలంటున్న రాజకీయ పరిశీలకులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆంధ్రా అన్నా హజారే అనిపించుకోవాలని నిత్యం తాపత్రయపడే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి అవినీతి బాగోతం రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తోంది. చంద్రబాబు సింగపూర్ బ్యాంక్ ఖాతా రహస్యాన్ని బట్టబయలు చేసిన కోలా కృష్ణమోహన్.. తాజాగా బాబు అండ్ కోకు చెందిన మరిన్ని రహస్య ఖాతాల వివరాలు బహిర్గతం చేశారు. తనకు పార్టీ టికెట్ ఇస్తానంటూ చంద్రబాబు రూ. 5.10 కోట్లు దండుకున్నారని.. అందులో రూ. 4 కోట్లు బాబు సింగపూర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశానని ఆరోపించటంతో పాటు.. సదరు బ్యాంక్ ఖాతా నంబర్‌ను కూడా కోలా (యూరో లాటరీ తగిలిందని చెపుకున్న వ్యక్తి) ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయనకు సన్నిహితుడిగా మెలిగిన కృష్ణమోహన్.. తాజాగా బాబు సమీప బంధువులు, సన్నిహితుల విదేశీ బ్యాంక్ అకౌంట్ల వివరాలను బయటపెట్టారు. చంద్రబాబు అవినీతి బాగోతానికి సంబంధించి దశల వారీగా వివరాలు వెల్లడిస్తానని అప్పట్లోనే చెప్పిన కృష్ణమోహన్ తాజాగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. భద్రత దృష్ట్యా తాను బహిరంగంగా మీడియా సమావేశం నిర్వహించలేకపోతున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, అయన సన్నిహితులకు చెందిన ఎనిమిది విదేశీ బ్యాంక్ ఖాతాల వివరాలను కృష్ణమోహన్ వెల్లడించారు. పంజాగుట్టలోని ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా 1998కి ముందే ఆయా ఖాతాలను ఓపెన్ చేశారని కృష్ణమోహన్ వివరాలతో సహా పేర్కొనటం సంచలనం సృష్టిస్తోంది. చంద్రబాబు, ఆయన సన్నిహితుల ఖాతాల్లో లక్షలాది డాలర్ల లావాదేవీలు జరిగాయని, ఈ వివరాలను త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్‌కు వెల్లడిస్తానని కృష్ణమోహన్ చెప్పారు.

బాబు చీకటి ఖాతా వెలుగులోకి...


సింగపూర్‌లో చంద్రబాబుకు గల చీకటి ఖాతాను కోలా కృష్ణమోహన్ గతంలోనే బయటపెట్టారు. తన బ్యాంక్ ఖాతా నుంచి చంద్రబాబు సింగపూర్ బ్యాంక్ ఖాతాకు డబ్బును మళ్లించినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. కృష్ణమోహన్ ఈ నెల 9వ తేదీన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తానని చంద్రబాబు నాకు ఆశచూపారు. అందుకు డబ్బులు అడిగారు. చంద్రబాబుకు తొలుత రూ. 10 లక్షలు చెక్కు రూపంలో ఇచ్చాను. 1999 ఏప్రిల్ 24న చంద్రబాబు ఇంట్లో స్వయంగా కోటి రూపాయల నగదు ఇచ్చా. అదే ఏడాది ఆగస్టులో.. సి. నాయుడు నారా పేరుతో సింగపూర్ రాఫెల్స్‌క్యూలోని డాయిషే బ్యాంక్‌లో గల 2248634590-4985 నంబరు గల ఖాతాకు రూ. 4 కోట్లు బదిలీ చేశా’’ అని వివరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తనపై ఎన్‌ఫోర్స్‌మెండ్ డెరైక్టరేట్ అధికారులు దాడులు చేయగా.. బాబు విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలు వారికి తెలిసిందని.. అయితే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రూ. 50 లక్షలు లంచం ఇచ్చి ఈడీ అధికారులను మేనేజ్ చేశారని కూడా కోలా వివరించారు. అలాగే.. బాబుకు తాను నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం బయటపెట్టకూడదంటూ ఆనాటి పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాల ఉన్నతాధికారులు స్వయంగా బెదిరించారనీ తెలిపారు. ఆ తర్వాత తనపై హత్యా యత్నాలు కూడా జరిగాయని చెప్పారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ కృష్ణమోహన్ 420 అని ఆరోపించటమే తప్ప తన బ్యాంక్ ఖాతా గురించి ఒక్క మాట మాట్లాడలేదు.


బాబుకు సింగపూర్ బ్యాంక్‌లో ఖాతా ఉన్నదని కృష్ణమోహన్ వెల్లడిస్తే.. తనకు స్విస్ బ్యాంక్‌లో ఎలాంటి ఖాతాలు లేవని చంద్రబాబు పేర్కొనటం గమనార్హం. కోలా చెప్పిన మాటలు అబద్ధమని, తన బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు వారంలో బయటపెడతానని ప్రకటించారు. కానీ.. పది రోజులు గడచిపోయినా ఆ ఊసే ఎత్తలేదు. చంద్రబాబు తనను 420గా అభివర్ణించటంపై కృష్ణమోహన్ అంతే స్థాయిలో స్పందించారు. తాను 420 అయితే చంద్రబాబు 42000 అంటూ ఘాటుగా స్పందించారు. తాను ఇచ్చిన వివరాలు వాస్తవమని, వాటిపై దర్యాప్తు జరపాలని హైకోర్టును ఆశ్రయించటంతో పాటు తన దగ్గర ఉన్న అన్ని వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌కు వెల్లడిస్తానని కృష్ణమోహన్ మరోసారి వెల్లడించారు. మొత్తం మీద చంద్రబాబు, ఆయన సన్నిహితుల విదేశీ బ్యాంక్ ఖాతాల వ్యవహారం ముదిరిపాకాన పడుతోంది. మామూలుగా ఆరోపణలకు పరిమితం కాకుండా బ్యాంక్ పేర్లు, వాటిలో ఖాతా నెంబర్లు కూడా కృష్ణమోహన్ వెల్లడించటంతో ఇప్పుడు చంద్రబాబు సమాధానం చెప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బాబు విదేశీ ప్రయాణాల రహస్యమేమిటో?

కోలా తాజా ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ఏటా సాగించే రహస్య విదేశీ ప్రయాణాలపై ఇప్పుడు అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. చంద్రబాబు ఏటా తన కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ మీదుగా ఏదో దేశానికి వెళ్లి వస్తుంటారు. తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి తానెక్కడికి వెళుతున్నాన్నది ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారన్నది అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ఇప్పుడు సింగపూర్, మారిషస్‌లతో పాటు పలు దేశాల్లో బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని వెల్లడి కావటంతో ఈ రహస్యం త్వరలోనే బట్టబయలయ్యే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కృష్ణమోహన్ బ్యాంక్ ఖాతా నంబర్లు కూడా ఇచ్చినందున వాటి వివరాలను తెలుసుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలపై ఉన్నదని కూడా వారంటున్నారు.